కష్టానికీ.. కాష్టానికీ కనికరించరా! | - | Sakshi
Sakshi News home page

కష్టానికీ.. కాష్టానికీ కనికరించరా!

Jul 20 2026 12:32 AM | Updated on Jul 20 2026 12:32 AM

వైఎస్సార్‌ పాలనా కాలంలో

సంక్షేమ బోర్డు..

అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతకు కేంద్రం ప్రభుత్వం 1996లో పార్లమెంటులో ప్రైవేటు బిల్లు తీసుకురాగా రాష్ట్రంలో మహానేత వైఎస్సార్‌ హయాంలో ఏపీ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు –2009 పేరుతో అమలు చేశారు.

భవన నిర్మాణ కార్మికులకు

ప్రభుత్వం అన్యాయం

నిబంధనల పేరుతో

సంక్షేమ బోర్డు నిర్వీర్యం

ఉమ్మడి జిల్లాలో

రూ.5 కోట్ల క్లెయిముల బకాయి

ప్రమాదవశాత్తూ జరిగే

మరణానికి సాయం కరువు

కపిలేశ్వరపురం: తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని ప్రశ్నించిన శ్రీశ్రీకి ఎప్పటికీ సమాధానం దొరకదేమో. చలువ రాతి మేడల్లో.. ఏసీ గదుల్లో.. గుండెలపై చేయి వేసుకుని నిద్రిస్తున్న ప్రతి మనిషి సుఖం వెనుక మరొకరి కష్టమనే పునాది రాయి దాగి ఉంది. ఆ భవన నిర్మాణానికి ఆ రోజుకు ఎవరో వస్తారు.. మేస్త్రి చెప్పిన పని చేసేసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఎవరికి ఎవరో. కొన్నాళ్లకి ఆ నిర్మాణం ఇంద్రభవనంలా కళకళలాడుతూ పిల్లా పాపలతో సందడిగా మారిపోతుంది. అటుగా వచ్చిన ఆ కార్మికుడు ఇది నేనే కట్టానని చెప్పుకొని మురిసిపోతాడు. అదీ అతడి జీవన చిత్రం. అదేవిటో.. ఆ జీవన చిత్రాలన్నీ ఎప్పుడూ వెలిసిపోయే ఉంటాయి. వారి సంక్షేమాన్ని గుర్తించే వారు ఉండరు. భవన నిర్మాణ కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరం. వారు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును అంతకంతకూ నిర్వీర్యం చేస్తున్నారు.

కార్మికుల సంఖ్య తగ్గిస్తూ కుట్ర..

కార్మిక శాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 67,755 మంది పురుషులు, 36,483 మంది సీ్త్రలు భవన నిర్మాణ కార్మికులుగా నమోదయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019 నాటికి బోర్డులో 2.45 లక్షల మంది ఉండేవారు. పునాది మొదలుకుని తుది నిర్మాణం వరకూ మొత్తం 52 రకాల వృత్తుల వారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. అయితే 2020కి ముందు మంజూరైన కార్మికుల గుర్తింపు కార్డులను రెన్యువల్‌ చేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల వారిలో 1.45 లక్షల మందిని తొలగించి ఈ ఏడాది మార్చి ఒకటి నాటికి ఆ సంఖ్యను 1.05 లక్షలకు పరిమితం చేసింది.

ప్రయోజనాలు కుదించి..

సంక్షేమ బోర్డు అమలుకు సంబంధించి ఈ ఏడాది మార్చి 1న చంద్రబాబు ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. అవి ప్రముఖంగా కార్మికుడి కుటుంబ సభ్యుల వివాహం సమయంలో, భార్య, కుమార్తెల కాన్పు సమయంలో, సహజ మరణం పొందినప్పడు మాత్రమే సాయం చేయాలని నిర్ణయించింది. వృత్తి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత అంగ వైకల్యం కలిగినా, కార్మికుల పిల్లల చదువులకు ఉపకార వేతనాల వంటివి వాటిలో ప్రస్తావించకపోవడాన్ని కార్మికులు విమర్శిస్తున్నారు. కార్మికుడి కుమార్తెకు వివాహం జరిగినప్పుడు రూ.40 వేలు ఇస్తామని కూటమి అనుకూల పత్రికల్లో ప్రచారం చేసుకున్నా రూ.20 వేలకు పరిమితం చేశారు. అదికూడా ఇద్దరికి మాత్రమే. కార్మికుని భార్య, కుమార్తెల కాన్పు సమయంలో రూ.20వేలు ఇస్తామన్న సాయాన్ని రెండు కాన్పులకు పరిమితం చేసింది.

బకాయిల మాటేవిటి?

2019 నుంచి నేటి వరకూ ఉమ్మడి జిల్లాలో కార్మికుల క్లెయిమ్‌ దరఖాస్తు పరిష్కారానికి చెల్లించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు బకాయి పడింది. దీనిపై ఎటువంటి స్పందనా లేదు.

ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది

కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మరో పక్క బిల్డర్సుకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. భవన నిర్మాణం చేపట్టినప్పుడు బిల్డరు కార్మిక శాఖకు లేబర్‌ సెస్సు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం వసూలును పూర్తిగా పక్కకు పెట్టేయడం ద్వారా బిల్డర్‌ పక్షాన నిలబడింది. కానీ బిల్డరు తన భవనాలను అమ్మేటప్పుడు కొనుగోలు చేసే వినియోగదారుడి వద్ద నుంచి సెస్సు వసూలు చేస్తున్నాడు. మొత్తంగా సంక్షేమ బోర్డుకు చెందాల్సిన సెస్సు బిల్డర్‌ జేబులోకి వెళ్లిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

– చెక్కల రాజ్‌కుమార్‌, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, సంక్షేమ బోర్డు స్క్రూటినీ కమిటీ సభ్యుడు,

సీఐటీయూ నాయకుడు

పోరాడుతున్నా పట్టని ప్రభుత్వం

చంద్రన్న బీమా పథకాన్ని పునః ప్రారంభించబోతున్నట్టు ఈ ఏడాది జూన్‌ 12న కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్‌ విజయవాడలో ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. భవన నిర్మాణ కార్మికుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ బిల్డింగ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్‌ 15న విజయవాడ లేబర్‌ కార్యాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా లేబర్‌ కార్యాలయాలు ఎదుట ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement