పిఠాపురం: జనగణన ప్రారంభించి నెలన్నర దాటుతున్నా సంబంధిత సిబ్బందికి వేతనాలు అందక నానా యాతన పడుతున్నారు. మే ఒకటో తేదీన జన, గృహ గణన ప్రారంభించి 30వ తేదీ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లుగా పని చేశారు. వారందరికీ ప్రభుత్వ గౌరవ వేతనం చెల్లించాలి. నేటికీ వారికి నయా పైసా ఇవ్వలేదు. దీంతో సదరు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెల్లించాల్సింది రూ.3 కోట్ల పైనే..
గృహగణన విధులు నిర్వర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఒకొక్కరికీ రూ.9 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. అలాగే శిక్షణకు హాజరైనందుకు రూ.1,200 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరికి మొత్తం రూ.10,200 చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలో 3100కు పైగా ఉన్న సిబ్బందికి రూ.3.10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాలకు సంబంధించిన నిధులను కలెక్టర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు ప్రభుత్వం మే 12న ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్తున్నారు. జనగణనలో భాగంగా చేపట్టిన గృహ గణన పూర్తయితే వెంటనే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు గౌరవ వేతనం చెల్లించాలనే ఆదేశాలను అధికారులు పక్కన పెట్టినట్లు సిబ్బంది చెప్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా వారికి ఏ చెల్లింపులూ జరగలేదు. దీనికి గృహగణనలో నమోదైన ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్లకు సంబంధించి ఎందుచేత ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందున గౌరవ వేతనం చెల్లించలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పని చేసిన తమకు రావాల్సిన గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని సిబ్బంది కోరుతున్నారు.
జనగణన నిర్వహిస్తున్న సిబ్బంది
జనగణన చేసిన సిబ్బందికి
అందని వేతనాలు
నెలన్నర దాటినా పైసా
విదల్చని అధికారులు
ఖాళీ ఇళ్లు.. తాళాలున్న ఇళ్ల వివరాలు అప్‌లోడ్ చేశాకే అని మెలిక
జిల్లాలో మొత్తంగా
రూ.3.10 కోట్ల బకాయి


