అడుగు జారింది.. ఊపిరి ఆగింది! | - | Sakshi
Sakshi News home page

అడుగు జారింది.. ఊపిరి ఆగింది!

Jul 19 2026 12:15 AM | Updated on Jul 19 2026 12:15 AM

ప్రాణం తీసిన చేపల వేట

గోదావరిలోకి జారి ఐదుగురి మృతి

ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు

గొమ్ముకొత్తగూడెంలో తీవ్ర విషాదం

ఎటపాక: చేపల వేట ఐదుగురిని బలిగొంది. ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పురుషులు వలలు పట్టుకుని శనివారం ఉదయాన్నే గొల్లగూడెం సమీపంలోని గోదావరి నది వద్దకు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో చేపలు పడతాయని నీటి ప్రవాహానికి అడ్డంగా వలలు పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో వల పట్టుకుని నీటిలో శివారున ఉన్న ఊకే రమేష్‌ (37) కాలు జారింది. అతను నీటి లోతులోకి జారిపోయాడు. రమేష్‌ నీటిలో మునిగిపోతుండగా, ఈత వచ్చిన బాసిబోయిన బాలరాజు (40) అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలరాజును రమేష్‌ గట్టిగా పట్టుకోవటంతో వారిద్దరూ ఒక్కసారిగా మునిగిపోయారు. వారిని కాపాడేందుకు అక్కడే వల పట్టుకుని ఉన్న ఊకే లక్ష్మి (37), ఊకే సుశీల (37), తుర్రం భారతి (40) వారి వద్ద ఉన్న చున్నీలు, వలలు విసిరి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మహిళలూ అదుపుతప్పి మునిగిపోతుండగా, అది గమనించిన మరో గ్రూప్‌లోని మహిళలు కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ ముగ్గురితో పాటు రమేష్‌, బాలరాజు నీటిలో మునిగి కొట్టుకుపోయారు. దీనిని గమనించిన అక్కడి మహిళలు కేకలు వేయడంతో సమీపంలో నివాసం ఉంటున్న మత్స్యకారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే వారు నీటిలో మునిగి గల్లంతయ్యారు. చివరికి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ, ఎస్సై అప్పలరాజు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లు, పడవల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు కొంత దూరంలో మునిగిపోయిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

అదే కారణమా..

శనివారం తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురిసింది. వాగులు, వంకలు వరద నీటితో పారుతుంటే చేపలు ఎదురీదుతూ ఉంటాయని, ఆ సమయంలో చేపలు పడతాయని గిరిజనులు అంటుంటారు. ఈ క్రమంలో గోదావరిలో వేటకు వచ్చిన గొమ్ముకొత్తగూడెం వాసులు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకున్నారు. వరద నీటి ఉధృతి ఉండడం, గోదావరిలో నీటి లోతు అంచనాకు దొరకకపోవడంతో రమేష్‌ కాలు జారిందని భావిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు జారి గల్లంతయ్యారు. ఈ ఘటన గొమ్ముకొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం రోదనలతో మార్మోగింది. ఒకే గ్రామానికి చెందిన బంధువులు విగత జీవులుగా పడి ఉండడం చూసి వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బాధితులకు అండగా ఉంటాం

చింతూరు: ఎటపాక మండలంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడిన సంఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అన్నారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. గొమ్ముకొత్తగూడెంకు చెందిన గిరిజనులు చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టామన్నారు.

మృతులు ఊకే రమేష్‌, బాసిబోయిన బాలరాజు, ఊకే లక్ష్మి, ఊకే సుశీల

కొంపముంచిన వేట

వర్షాకాలం వచ్చిందంటే చేపల వేటంటే ఆదివాసీలకు ఎంతో ఇష్టం. పిల్లాపెద్దా అంతా మూకుమ్మడిగా వలలు చేతబట్టి చెరువులు, కాలువలు, నదుల్లో చేపలు పడుతుంటారు. పట్టిన చేపలను అంతా సమ భాగాలుగా చేసుకుని ఇంటికి చేరుకోవడం వారి ఆచారం. పట్టిన చేపలతో కుటుంబ సభ్యులంతా కలసి భోజనం చేసి ఆనందంగా గడుపుతుంటారు. మిగిలిన చేపలను ఎండబెట్టి తర్వాత వాడుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement