● సామాన్యులకు రక్షణ కరవు
● అధికారం కోసం ఎంతకై నా తెగిస్తారు
● రాజకీయాల్లో విలువల్లేకుండా చేశారు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): చంద్రబాబువి కుటిల రాజకీయాలని, అధికారం కోసం ఆయన ఎంతకై నా తెగిస్తారని, కుటుంబాలను సైతం రోడ్డు పాలు చేస్తారని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ కార్యకర్త నందిక సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డితో కలసి వేణు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో సామాన్యులకు రక్షణ కరవైందని అన్నారు. రాజకీయాల్లో విలువలు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిని అదే నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారని, ఇదెంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
సామాన్యులకు ఆపద వచ్చినప్పుడు వ్యవస్థ అండగా ఉండాలని, అటువంటిది ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన బాధితులను అనపర్తి ఆసుపత్రి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తరలించడం దారుణమని వేణు అన్నారు. పైగా అక్కడ ఎటువంటి వైద్యం అందించకుండా, పోలీసులు వచ్చి శుక్రవారం రాత్రి 9 గంటలకు సత్యనారాయణను బలవంతంగా డిశ్చార్జి చేయడం చూస్తూంటే రాష్ట్రంలో వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. శనివారం ఉదయం తిరిగి అస్వస్థతకు గురవడంతో సత్యనారాయణ తిరిగి కాకినాడ జీజీహెచ్‌లో చేరారని, బాధితుడికి సరైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. మాట్లాడితే బీసీ నినాదం తీసుకువస్తున్న రామకృష్ణారెడ్డి.. తానే ఆ శాఖకు రాష్ట్ర మంత్రిగా పని చేసిన విషయం మరచిపోయారా అని వేణు ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు అవినీతికి పాల్పడుతున్నా మాట్లాడకూడదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారులను పావుల్లా వాడుకుంటోందన్నారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయని, ఇతరులు ఆస్తులపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు తమ అనుచరులతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, వైద్యం కూడా అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు, పార్టీ, తాను అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.


