● గొల్లప్రోలు హత్య కేసును
ఛేదించిన పోలీసులు
● నిందితుడితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
● మిగిలిన వారి కోసం గాలింపు
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గొల్లప్రోలు పట్టణ పరిధిలో ఈ నెల 14న జరిగిన లింగం అర్జునుడు హత్య కేసును పోలీసులు చేధించారు. సీఐ జి.శ్రీనివాస్ శనివారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు ఎస్సీ కాలనీకి చెందిన లింగం అర్జునుడి హత్యకు గురైన నేపథ్యంలో అతని భార్య సంధ్య ఫిర్యాదుపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు అర్జునుడు నిందితుడైన బచ్చల మారుతి పవన్ అలియాస్ కళ్యాణ్ మరికొందరు స్నేహితులతో కలిసి ఈ నెల 14న దారపల్లి వాటర్‌ఫాల్స్‌కు వెళ్లారు. అక్కడి మద్యం కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం సమీపంలో వైన్ షాప్ వద్ద మరొకసారి వారి మధ్య గొడవ జరిగింది. కళ్యాణ్ తల్లిని అర్జునుడు దూషించడం, ఆర్థికంగా స్థిరపడినవాడు కావడం వంటి కారణాలతో అతడిపై మరింత ద్వేషం పెంచుకున్నాడని సీఐ తెలిపారు.
కల్యాణ్ కొందరు స్నేహితులతో కలిసి రాత్రి 8:15 సమయంలో అర్జునుడికి క్షమాపణ చెప్పే పేరుతో ఇంటికి వెళ్లి ముందస్తు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న చాకుతో పొట్టలో బలంగా పొడిచాడని, పిఠాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా అర్జున్ చనిపోయినట్టు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ప్రధాన ముద్దాయి బచ్చల మారుతి పవన్ అలియాస్ కల్యాణ్‌తో పాటు కారి కుమార్ రాజా, బోడపాటి నానిబాబు, చెల్లి ఆనంద్‌కుమార్‌లను అదులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.


