నాణ్యమైన బోధన జరగాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన బోధన జరగాలి

Jul 16 2026 5:24 AM | Updated on Jul 16 2026 5:24 AM

పెద్దాపురం: విద్యార్థులకు నూతన విధానాలతో నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌, పీఎం జవహర్‌ నవోదయ విద్యాలయ చైర్మన్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. పెద్దాపురంలో నవోదయ విద్యాలయలో బుధవారం జరిగిన మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎన్‌సీసీ క్యాడెట్స్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యాలయ కార్యకలాపాలు, ప్రగతిని సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్‌ ఎస్‌ఎస్‌సీ కీర్తి వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, విద్యార్థులకు ఒకవైపు పోటీ పరీక్షలపై తర్ఫీదు ఇస్తూనే, బోధన అందించాలని సూచించారు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలకు అనుగుణంగా చదువుకోవాలని అన్నారు. సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రియ, డీఈఓ పి.రమేష్‌, డీఎంహెచ్‌ఓ అనిత, ఎంఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణమూర్తి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓగా

అనిత బాధ్యతల స్వీకరణ

కాకినాడ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ)గా కోనాల అనిత కాకినాడలోని కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం డీఎంహెచ్‌ఓగా పని చేసిన ఆమె సాధారణ బదిలీల్లో ఇక్కడకు వచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ను డాక్టర్‌ అనిత మర్యాద పూర్వకంగా కలిశారు.

వాటర్‌ఫాల్స్‌ వద్ద జరిగిన

వివాదంతోనే హత్య

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): గొల్లప్రోలు నగర పంచాయతీ రెండో వార్డు మాజీ కౌన్సిలర్‌ భర్త లింగం అర్జునుడు హత్యకు దారపల్లి వాటర్‌ఫాల్స్‌ వద్ద జరిగిన ఘర్షణే కారణమని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మంగళవారం కొంతమంది స్నేహితులు దారపల్లి వాటర్‌ఫాల్స్‌కు వెళ్లారు. అక్కడ బచ్చల మారుతీ పవన్‌ అలియాస్‌ కల్యాణ్‌కు, అర్జునుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఇతర స్నేహితులు సర్ది చెప్పారు. ఈ ఘర్షణను మనసులో పెట్టుకున్న కల్యాణ్‌ క్షమాపణ చెప్పే నెపంతో అర్జునుడి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో వెంట తీసుకు వెళ్లిన పదునైన చాకుతో అర్జునుడి కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అర్జునుడు పిఠాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. దీనిపై గొల్లప్రోలు స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.

కత్తితో దాడి.. యువకుడి మృతి

కొత్తపల్లి: కొంతమంది యువకులు కత్తితో దాడి చేయడంతో అమ్మమ్మ అంతిమ సంస్కారానికి వచ్చిన ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన వేమగిరి రమణమ్మ మృతి చెందింది. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కాదా రాకేష్‌(28)కు ఆమె అమ్మమ్మ అవుతుంది. ఆమె అంతిమ సంస్కారంలో పాల్గొనేందుకు బుధవారం వచ్చాడు. తన చిన్న మేనత్త కుమార్తెను వేధిస్తున్నాడంటూ రాకేష్‌తో పండు అనే యువకుడు వాగ్వాదానికి దిగాడు. అనంతరం, అమ్మమ్మ అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు రాకేష్‌ వెళ్లాడు. ఆ సమయంలో కూడా వారిద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో, అక్కడి వారు 112 నంబరుకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాల వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే, రమణమ్మ అంతిమ సంస్కారాలు ముగిసిన తరువాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పండు, వడ్డి వంశీతో పాటు మరో కొంత మంది యువకులు రాకేష్‌పై దాడి చేసి, కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను తొలుత నాగులాపల్లి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement