కోవిడ్ వార్డు ఏర్పాటు
కాకినాడ జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ఆధ్వర్యంలో కోవిడ్ వైద్య సేవల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈఎన్‌టీ భవనంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. ఆసుపత్రి వరకు కిట్లు, మందులు తగినంతగానే ఉన్నాయి. పల్మనాలజీ సహా ఇతర విభాగాల వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు కొరత లేదు. ప్రజల్లో కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలని నిర్ణయించాం. కాకినాడతో పాటు తుని ఏరియా ఆసుపత్రిలోనూ ప్రత్యేక వార్డు ఏర్పాటైంది. త్వరలో జిల్లాలో ఇతర ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష కిట్లు సహా మందులు, ఆక్సిజన్ సరఫరా ఇతర అవసరాలను సమకూరుస్తాం. అత్యవసర మందుల కోసం ఇండెంట్ పెడతాం.
– డాక్టర్ కోనాల అనిత, డీఎంహెచ్‌ఓ, కాకినాడ
కాకినాడ క్రైం: కరోనా మహమ్మారి మరోసారి తన ఉనికిని చాటుతోంది. జిల్లాను తాకుతూనే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కోవిడ్ సోకి 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వ సన్నద్ధత చర్యలు కానరావడం లేదు. సరిగ్గా ఆరేళ్ల కిందట కరోనా జిల్లా వాసులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ వైరస్ విజృంభించిన 18 నెలల కాలంలో ఇప్పటి కాకినాడ జిల్లా పరిధిలో ఏకంగా 9 వేల మరణాలు సంభవించాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఆసుపత్రులేవీ ఖాళీ ఉండేవి కావు. ప్రాణవాయువు గగనమైపోయేది. బయటకు వెళ్లాంటే భయం, ఇంట్లో ఉన్నా ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. అంతటి విపత్కర స్థితే మరోసారి ఆవిష్కృతం కానుందా అనే భయం ప్రజల్లో నెలకొంది. గొల్లప్రోలులోని కరణంగారి తోట ప్రాంతంలో నివాసం ఉండే బాలిక (16)కు కోవిడ్ పాజిటివ్ వచ్చి మృతి చెందింది. ఆమెకు కొన్నాళ్ల క్రితం స్ల్పీనోక్టమీ చేసి ప్లీహాన్ని తొలగించారు. బాలిక జన్యుపరమైన సమస్యతో హిమోగ్లోబినోపతికి గురైంది. ఇందుకు ఆమె కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నా, ఏ నాడు ప్రాణాపాయం వాటిల్లలేదు. కాకినాడ, విశాఖపట్నంలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యం కోసం వారం కిందట తమిళనాడు రాష్ట్రం వెల్లూరు ఆసుపత్రికి బాలికను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆరోగ్యం మరింత మెరుగై వస్తుందనుకున్న తరుణంలో కోవిడ్ లక్షణాలతో ఆమె మృతి చెందింది. వైద్యులు పరీక్షించి కోవిడ్ పాజిటివ్‌గా తేల్చారు. దీంతో బాలిక మృతదేహాన్ని ప్రత్యేక భద్రతా చర్యల మధ్య కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు పంపేశారు. గురువారం రాత్రికి బాలిక మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
అలముకున్న నిర్లక్ష్యం
జిల్లాలో కోవిడ్ నివారణపై ఎటువంటి సన్నద్ధత కానరావడం లేదు. సాధారణ జ్వరం అన్నట్లు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ జీజీహెచ్‌లో మాత్రమే ఏర్పాట్లు ఉన్నాయే తప్ప, జిల్లాలో మిగిలిన చోట్ల చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అంటూ ఏమీ లేవు. ఆక్సిజన్ లభ్యతపై తగిన అంచనా లేదు. కోవిడ్ లక్షణాలకు వినియోగించే సాధారణ పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వంటి మందులు తప్ప పరిస్థితి విషమిస్తే అప్పట్లో వినియోగించిన రెమిడెసివీర్, పొసకొనజోల్, యాంపిట్రోసిన్ డి, ఐవర్‌మెక్‌ట్రిన్ మందులు జిల్లాలో ఏ ఒక్క చోటా లేవు. అంతేకాదు, వ్యాధి నిర్ధారణకు వినియోగించే ఆర్టీపీసీఆర్ కిట్లు, కోవిడ్ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేవు. ఆఖరికి బాధితులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులు ధరించే పీపీఈ కిట్లు కనీసం అందుబాటులో లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కనీస జాగ్రత్తలు శూన్యం
గత కరోనా సమయంలో తీసుకున్న కనీస జాగ్రత్తలు ప్రస్తుతం ప్రజలెవరూ పాటించడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆ దశగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ ఏవీ లేవు. సామాజిక దూరం కనుమరుగైపోయింది. శానిటైజర్ల వినియోగం చూద్దామన్నా కానరావడం లేదు. మాస్క్ ఊసే లేదు. అప్పట్లో అప్పుడప్పుడు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కోవిడ్ నివారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందాలేవీ ప్రస్తుతం చురుగ్గా లేవు. అసలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆయా విభాగాల ఉనికే లేదు.
జీజీహెచ్‌పైనే ఒత్తిడి..
జిల్లాలో క్షేత్ర స్థాయి ఏర్పాట్లు పూర్తిగా శూన్యంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల సంఖ్య పెరిగినా, అనుమానితులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా కాకినాడ జీజీహెచ్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇక్కడకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి పశ్చిమ, విశాఖలో కొంత ప్రాంత వాసులు కూడా వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. సాధారణంగా శస్త్రచికిత్స వంటి వైద్య ప్రక్రియలు నిర్వహించేటప్పుడు అన్ని వైద్య పరీక్షలు లాగానే కోవిడ్ పరీక్ష కూడా చేస్తారు. అంతవరకు మాత్రమే పరీక్ష కిట్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. పరీక్షల కోసం క్యూ కడితే మాత్రం చేతులెత్తేసే పరిస్థితే కనిపిస్తోంది. జిల్లాలో ఏరియా ఆసుప్రతులు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో కనీస ఏర్పాట్లు చేయకపోతే, అటు రోగి ప్రాణాలతో పాటు జీజీహెచ్‌లో బాధితుల వైద్య సేవల నిర్వహణ కూడా అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
ఫ జిల్లాలో డేంజర్ బెల్స్
ఫ కరోనా నివారణకు కానరాని చర్యలు
ఫ ఇప్పటికే 16 ఏళ్ల బాలిక మృతి
ఫ ఆసుపత్రుల్లో లేని పరీక్ష కిట్లు


