కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. గురువారం కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం సమాధికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును, బాలును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాపు ఉద్యమ నేతకు నివాళి
కాకినాడ రూరల్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి తీర్చలేని లోటని కాపు జేఏసీ, ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు అన్నారు. కాకినాడ శుభం కాపు కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ నేతలు వాసురెడ్డి ఏసుదాసు, చిట్నీడి శ్రీనివాస్, సత్యనారాయణ, రంగనాయకులు, విష్ణు, ప్రకాష్, బాబ్జీ, నూకరాజు, రాజా తదితరులు మాట్లాడారు. 18న కాకినాడలో శుభం కాపు కల్యాణ మండపంలో సంతాప సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ముద్రగడకు ఘన నివాళులర్పించాలని కోరారు. రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి నాయకుల కోరిక మేరకు సంతాప సభను కాకినాడలో పెడుతున్నామని వాసురెడ్డి ఏసుదాసు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ జరుగుతుందన్నారు.
రైల్వే గేటు వద్ద
కలప ట్రాక్టర్ బోల్తా
రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్
కపిలేశ్వరపురం: రాజానగరం మండలం రాధేయపాలెం నుంచి మండపేట మండలం ద్వారపూడిలోని సామిల్లుకు కలప లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ద్వారపూడి సమీపంలోని జెడ్.మేడపాడు రైల్వే గేటు వద్ద గురువారం బోల్తా పడింది. దీంతో, జెడ్.మేడపాడు వంతెన వద్ద సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ట్రాక్టర్‌పై అధిక కలప లోడు వేశారు. ఈ క్రమంలో రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న రహదారి పైకి ఎక్కుతూండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించి, రాధేయపాలేనికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గోపిశెట్టి వెంకటేశ్వరరావు కిందికి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.


