పిఠాపురం రూరల్: యు.కొత్తపల్లి మండలం మూలపేటలో బుధవారం కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో కాదా రాకేష్ (28) మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం పోస్టుమార్టం జరగాల్సి ఉండగా, మృతుడి బంధువులు అడ్డుకున్నారు. రాకేష్‌కు భార్య, చిన్న పాప ఉన్నారని, అతని చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. అతని భార్య బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుడి బంధువుల్లో ఐదుగురికి గాయాలయ్యాయని, నిందితులపై మెడికో లీగల్ కేసు, 17 సంవత్సరాల బాలికను వేధించిన నేపథ్యంలో పోక్సో కేసు నమోదు చేయాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఐ శ్రీనివాస్‌కు అందజేశారు. సీఐ హామీతో పోస్ట్‌మార్టం చేసేందుకు బంధువులు అంగీకరించారు.


