కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీఓ నంబర్ 396ని రద్దు చేయాలని రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 6, 7 తేదీల్లో పెన్‌డౌన్ చేశారు. ఈ రెండు రోజుల్లో కాకినాడ జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ. 4 కోట్ల ఆదాయానికి గండిి పడింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనలు ఉధృతం చేసేందుకు లేఖర్లు సిద్ధమయ్యారు. ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకూ పెన్‌డౌన్ చేసి ఆందోళలు చేపట్టాలని జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన దస్తావేజు లేఖర్లు సిద్ధమవుతున్నారు. కాకినాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు గురువారం సమావేశమై 20వ తేదీ నుంచి చేపట్టనున్న పెన్‌డౌన్ నిరసనలపై చర్చించారు. తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. జీఓ 396 అమలైతే దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెన్‌డౌన్ కార్యక్రమానికి క్రయవిక్రదారులు, ప్రజలు సహకరించాలని దస్తావేజు లేఖర్ల సంఘం కాకినాడ అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు కోరారు. కార్యక్రమంలో జాడ అప్పలరాజు, మేడిశెట్టి శ్రీనివాస్, మేడిశెట్టి త్రినాథ్, మహేష్, నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు.


