రాజమహేంద్రవరం సిటీ: సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు సంఘ నిర్మాణం, సభ్యుల ఐక్యత, చైతన్యమే ప్రధాన ఆయుధాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ అన్నారు. స్థానిక ఆనం కళా కేంద్రంలో గురువారం సంఘం నిర్మాణ వర్క్‌షాపు జరిగింది. రెండేళ్లుగా జిల్లాలో సంఘం చేపట్టిన కార్యక్రమాలను ఇందులో సమీక్షిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని సుమారు 10 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంఘం నాయకత్వం వహిస్తోందని చెప్పారు. దీనిని మరింత బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లోని నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదును ఉద్యమంలా కొనసాగించాలన్నారు. విజయవాడలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే సమావేశంలో రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. ఈ వర్క్‌షాపులో సుమారు 200 మంది జిల్లా, తాలూకా స్థాయి నాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి వెల్సన్‌పాల్, నాయకులు చాంబర్లీన్, కె.వెంకటేశ్వరరావు, కె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


