పట్టాలు తప్పిన గూడ్స్‌ వ్యాగన్‌ | - | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ వ్యాగన్‌

Jul 17 2026 12:23 AM | Updated on Jul 17 2026 12:23 AM

తుని: తుని రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం నుంచి నిడమనూర్‌ ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్‌ రైలుకు సంబంధించి వ్యాగన్‌ తుని స్టేషన్‌ లూప్‌ లైన్‌లో పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం – విజయవాడ మధ్య వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి జీఆర్పీ ఎస్సై సత్తిబాబు, స్టేషన్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి ఇనుప ఖనిజంతో బయలు దేరిన గూడ్స్‌ రైలు తుని రైల్వే స్టేషన్‌లో లూప్‌ లైన్‌కు సిగ్నల్‌ ఇచ్చారు. రాత్రి 9.30 గంటలకు తాండవ బ్రిడ్జి నుంచి వస్తుండగా, 17వ నంబరు వ్యాగన్‌ పట్టాలు తప్పింది. దీంతో సగం వ్యాగన్‌లు తాండ నది బ్రిడ్జిపై ఉండిపోయాయి. ఇది గమనించిన అధికారులు విశాఖపట్నం– విజయవాడ వైపు వెళ్లే రైళ్లను అనకాపల్లి జిల్లా పరిధిలోని స్టేషన్లలో నిలిపివేశారు. తాండవ బ్రిడ్జిపై ఉండిపోయిన వ్యాగన్లను అధికారులు వేరే ఇంజిన్‌ సహాయంతో అనకాపల్లి జిల్లా గుల్లిపాడు రైల్వే స్టేషన్‌కు తరలించారు. తునిలో పట్టాలు తప్పిన వ్యాగన్‌ని యంత్రాల సహాయంతో తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెప్పారు.

ప్రయాణికులకు ఇబ్బందులు

గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో తుని రైల్వే స్టేషన్‌లో విజయవాడ, హైదరాబాద్‌ వైపు, వెళ్లే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పై ఉండిపోయారు. విశాఖపట్నం నుంచి బయలుదేరిన గరీబ్‌రథ్‌, రాయగడ, మచిలీపట్నం, ప్రత్యేక రైళ్లను అనకాపల్లి జిల్లా పరిధిలోని రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. ప్రయాణికుల కోసం తుని రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. త్వరితగతిన రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. విజయవాడ – విశాఖపట్నం వైపు మాత్రం రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి.

తుని రైల్వే స్టేషన్‌లో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement