అంతర్జాతీయ
డిమాండుకు తగినట్టుగా..
అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా కాయర్ పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చు. ప్రస్తుతం కేరళంలో వ్యాపారులు, పీచు ఉత్పత్తిదారులు ఇదే వ్యూహం అవలంబిస్తున్నారు. కేరళ, తమిళనాడుతో పోలిస్తే ఇక్కడ క్రాప్ విధానం చాలా తేడా. కొబ్బరి దిగుబడి, కాయ సైజు అన్నీ వేరుగా ఉన్నందున, కాయర్ ఉత్పత్తులను తగిన విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. నీడిల్‌ఫెల్ట్‌కు యూరప్‌లో మంచి డిమాండ్ ఉంది.
– అజిత్ మాథ్యూ, కాయర్ స్ట్రాటజిక్
టెక్నికల్ పార్టనర్ కన్సల్టెంట్, కేరళం
సాక్షి, అమలాపురం: ‘మన దేశంలో ఉత్పత్తి చేసే కాయర్ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినది. ఒకవిధంగా చెప్పాలంటే ఇది చెట్టు నుంచి వస్తున్న బంగారం. అయితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత నాణ్యమైన ఉత్పత్తి తయారు చేయాలి. అలాగే, డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై దృష్టి సారించాలి’ అని కాయర్ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన కాయర్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ, సరైన బ్రాండింగ్ లేక, అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన గుర్తింపు లభించడం లేదని అన్నారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో రెండు రోజుల కాయర్ కాన్‌క్లేవ్–2026 గురువారం ప్రారంభమైంది. ఉద్యాన, ఎంఎస్‌ఎంఈ, మార్కెటింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ప్రారంభించారు. తొలుత కాయర్ బోర్డు కార్యదర్శి ఎంఎస్ లక్ష్మీప్రియ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. తరువాత కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాయర్ రంగ నిపుణులు, నాబార్డు, ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, కాయర్ ఉత్పత్తుల తయారీ, ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత ఉత్పత్తులు, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రైతులకు, మహిళలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండటంతో గ్రామీణ ఉపాధి పెంపునకు కాయర్ పరిశ్రమ కీలకమని అన్నారు. ‘బ్రాండ్ కోనసీమ కాయర్‘ పేరుతో మార్కెటింగ్ చేపడితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
బ్రాండింగ్‌తో అంతర్జాతీయ
మార్కెట్‌కు ఎదగాలి
కాయర్ కాన్‌క్లేవ్‌లో నిపుణుల సూచన
అనాతవరంలో ప్రారంభమైన
రెండు రోజుల సదస్సు


