● ఏలేరు, పీబీసీ ఆయకట్టులో నీటి ఎద్దడి
● ఎండుతున్న పంటలు
● కత్తి మీద సాములా ఖరీఫ్ సాగు
పిఠాపురం: నారు పోసిన వాడే నీరు పోస్తాడని అంటారు. కానీ నారు పోసినా నీరు పోసే వారు లేరంటున్నారు రైతులు. ఖరీఫ్ సాగు ఆరంభమై 45 రోజులైంది. ఈ తరుణంలో ఎల్‌నినో ప్రభావంతో ఓవైపు వరుణుడు కరుణించడం లేదు. మరోవైపు కాలువల ద్వారా సాగునీరు సైతం అందక ఏలేరు, పీబీసీ పరిధిలో ఖరీఫ్ సాగు కత్తి మీద సాములా మారిందంటూ అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఏలేరు.. కన్నీరు
జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు ఏలేరు నుంచి ప్రతి సంవత్సరం జూన్ పదో తేదీ నాటికే జలాలు విడుదల చేసేవారు. తద్వారా రైతులు నారుమళ్లు వేసి, జూలై మొదటి వారానికి వరి నాట్లు పూర్తి చేసేవారు. కానీ ఈ సంవత్సరం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏలేరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.68 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. దీని డెడ్ స్టోరేజీ 6.16 టీఎంసీలు. అంతకంటే తక్కువగా ఉంటే రిజర్వాయర్ నుంచి నీరు విడుదల సాధ్యం కాదు. వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో సైతం అరకొరగా ఉంది. దీంతో, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో 53 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఏలేరు జలాలు ఎంతవరకూ అందుతాయనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఈ నెల 19 నుంచి ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల చేయనున్నారు. అనంతరం రెండు మూడు రోజులకు ఆ నీరు ఆయకట్టుకు అందుతుందని, నారుమళ్లు, నాట్లు వేసేందుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏలేరు నీటి పారుదల శాఖ డీఈ సంతోష్ కుమార్ చెప్పారు. మరోవైపు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ఏలేరుకు మళ్లిస్తామని అధికారులు చెబుతున్నా అది ఎంతవరకూ ఫలితమిస్తుందో వేచి చూడాలి. జూన్ 16 నుంచి నారుమళ్లు వేసి, ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. కానీ, ఏలేరులో నీరు లేకపోవడంతో ఆయకట్టులోని దాదాపు 48 వేల మంది రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.
శివారుకు అందని నీరు
జిల్లావ్యాప్తంగా 2.26 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ వరి సాగు చేయనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గత నెల ఒకటో తేదీ నుంచే నీరు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలు శివారు ప్రాంతాలు కావడంతో నేటికీ పూర్తి స్థాయిలో గోదావరి జలాలు చేరడం లేదు. దీంతో, రైతులు నారుమడులు సైతం వేయలేకపోతున్నారు. పిఠాపురం బ్రాంచి కెనా ల్ (పీబీసీ) నుంచి ఆశించినంతగా నీరు రావడం లేదు. ఇప్పటి వరకూ కరప, కాజులూరు, పెదపూడి, గండేపల్లి తదితర మండలాల్లో నారుమళ్లు పూర్తి కాగా, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, తుని, తొండంగి తదితర మండలాల్లో నీరు లేక నారు పోసుకునే పరిస్థితి లేకపోయింది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల్లో మాత్రమే నారుమడులు సిద్ధం చేయగా 13 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు, వెదజల్లు పద్ధతిలో సాగు పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి ఈపాటికే సగం విస్తీర్ణంలో సాగు పనులు పూర్తి కావాల్సి ఉండగా సాగునీటి లభ్యత లేక రైతులు బేలచూపులు చూస్తున్నారు.
నారు పోసినా.. నీరు లేదు
సమయం మించిపోతూండటంతో కాలువలో ఉన్న కొద్దిపాటి నీరు, ఇటీవలి కురిసిన కొద్దిపాటి వర్షాలతో నారు పోశాం. ఈలోగా నీరు వస్తుందని ఆశ పడ్డాం. కానీ, పీబీసీ నుంచి సాగునీరు రావడం లేదు. మరోవైపు వానలూ లేవు. నారు వేసిన 21 రోజుల్లో సాగు నీరు రాకపోతే చాలా ఇబ్బంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు కలవరపెడుతోంది.
– జోకా కామరాజు, రైతు, కొత్తపల్లి


