ఆక్వాకు కరెంట్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆక్వాకు కరెంట్‌ షాక్‌

Jul 15 2026 1:46 AM | Updated on Jul 15 2026 1:46 AM

దెబ్బ మీద దెబ్బ

ఆక్వా ఫీడర్లపై ఎడాపెడా విద్యుత్‌ కోతలు

చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయి

తగ్గిపోయే ప్రమాదం

గత్యంతరం లేక జనరేటర్ల వినియోగం

డీజిల్‌కు నెలకు రూ.3 లక్షల

వరకూ అదనపు ఖర్చు

ఇప్పటికే ట్రంప్‌ సుంకాలతో

పడిపోయిన రేట్లు

మరోవైపు పెరిగిన మేత ధరలు

ఆపై విజృంభిస్తున్న వ్యాధులు

గడగడలాడుతున్న వనామీ రైతులు

ఐ.పోలవరం: దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉంది ఆక్వా రైతు పరిస్థితి. ఒకవైపు ట్రంప్‌ సుంకాలతో పడి పోయిన ధరలు.. మరోవైపు మేత ధరల పెంపు.. ఇంకోవైపు రొయ్యలపై వ్యాధుల పంజాతో ఇప్పటికే వా రు సతమతమవుతున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రభు త్వం ఎడాపెడా విద్యుత్‌ కోతలు విధిస్తోంది. ముఖ్యంగా ఆక్వా ఫీడర్లకే ప్రత్యేకంగా రోజుకు నాలుగైదు గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేస్తోంది. ఆ సమ యంలో డీజిల్‌ జనరేటర్లపై ఏరియేటర్లు నడపాల్సి రా వడంతో పెట్టుబడి తడిసి మోపైడె, తీవ్రంగా నష్టపోతున్నామని వనామీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ ఇబ్బంది

జిల్లాలో అధికారికంగా 21 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా కలిపి ఇది 35 వేల ఎకరాల వరకూ ఉంది. దీనిలో తొలి పంట మొత్తం సాగు జరుగుతూండగా రెండో పంట సుమారు 24 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అంచనా. ఇక మూడో పంట సుమారు 14 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈవిధంగా చూస్తే అంటే జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ ఏడాది కాలంలో అన్ని పంటలూ కలిపి సుమారు 73 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్‌ నిరంతరాయంగా అందాలంటే ఏరియేటర్లు పని చేయాల్సి ఉంటుంది. ఐదెకరాల రొయ్యల చెరువు సాగుకు వన్‌ హెచ్‌పీ ఏరియేటర్లు 40 కావాల్సి ఉంటుంది. అదే టు హెచ్‌పీ ఏరియేటర్లు అయితే 20 వరకూ అవసరం. రొయ్యల కౌంట్‌ ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకు 16 గంటలు, కౌంట్‌ తగ్గితే 18 గంటల పాటు ఏరియేటర్లు పని చేస్తూనే ఉండాలి. పగలు 4 గంటలు, సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకూ నిరంతరాయంగా నడపాలి. సరిగ్గా ఇటువంటి కీలక సమయంలోనే ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తూండటంతో ఏరియేటర్లు నిలిచిపోతున్నాయి. దీనివలన ఆక్సిజన్‌ లోపంతో రొయ్యలు చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో, ఏరియేటర్లను పని చేయించేందుకు రైతులు జనరేటర్లపై ఆధారపడక తప్పడం లేదు.

రెండేళ్లుగా సంక్షోభం

వనామీ సాగు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో ఉంది. కరోనా సమయంలో కూడా ఎదురు కాని సవాళ్లు ఇ ప్పుడు ఎదురవుతున్నాయి. ట్రంప్‌ సుంకాలకు తోడు అమెరికా–ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఏర్పడుతున్న ఉద్రిక్తతలతో పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోతున్నాయి. ఫలితంగా దేశానికి వందల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం తెస్తున్న వనామీ రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. తాజాగా మేత కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి ధరలు పెంచేశాయి. వనా మీ రొయ్యల మేతను టన్నుకు రూ.10 వేలు, టైగర్‌ రొయ్యల మేతను టన్నుకు రూ.12 వేల వరకూ పెంచారు. గత నెలలో రూ.8 వేలు, రూ.10 వేల చొప్పున పెంచాలని నిర్ణయించగా, రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలతో ప్ర భుత్వం చర్చలు జరిపింది. దీనిపై, ప్రభుత్వం నిర్ణ యం తీసుకునేలోపే కంపెనీలు మరో రూ.2 వేలు అదనంగా పెంచాయి. కిలో మేత ధరను రూ.4 తగ్గిస్తామ ని చెప్పి రూ.2 మాత్రమే తగ్గించాయి. జిల్లావ్యాప్తంగా ఏడాదికి 73 వేల ఎకరాల్లో జరుగుతున్న ఆక్వా సాగు కు 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత అవసరం. ధర పెంపుతో రైతులపై రూ.225 కోట్ల అదనపు భారం పడింది. మేత ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని వనామీ రైతులు గత నెలలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సమస్యలు చాలవన్నట్లు రొయ్యలకు గత నెలలో వైట్‌గట్‌, వైట్‌స్పాట్‌ వంటి వ్యాధులు సోకాయి. దీంతో, రైతులు మరిన్ని నష్టాలు చవిచూశా రు. ఒకవైపు ధరలు లేక.. మరోవైపు మేత మరింత ఖరీదైన పరిస్థితుల్లో ఇప్పుడు కరెంటు కోతలు కూడా విధిస్తూండటంతో ఆక్వా సాగు చేయడం కష్టమేనని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సాగు చేయలేకపోతున్నాం

ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్‌ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మంచిదే. కానీ, రోజుకు నాలుగైదు గంటలు కరెంటు కోతలు విధిస్తూండటంతో మాకు సాగు భారంగా మారింది. డీజిల్‌ ధర పెరిగింది. విద్యుత్‌ లేక జనరేటర్లు ఉపయోగించాల్సి రావడంతో డీజిల్‌ వినియోగం పెరిగి రూ.లక్షల్లో పెట్టుబడి అవుతోంది. అటువంటప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వల్ల ఉపయోగమేమిటి? ఆక్వా ఫీడర్లపై మాత్రమే కరెంటు కోతలు విధిస్తూండటంతో పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం.

– దంతులూరి నానీరాజు, అన్నంపల్లి

‘చమురు’ వదిలిపోతోందిలా..

ఐదెకరాల చెరువులో ఏరియేటర్లు తిప్పడానికి గంటకు 20 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది. రోజుకు 5 గంటల పాటు విద్యుత్‌ కోతలుంటే ఆ సమయంలో జనరేటర్లపై ఏరియేటర్లు తిప్పడానికి 100 లీటర్ల డీజిల్‌ అవసరమవుతుంది. దీని ప్రకారం రోజుకు రూ.10 వేలు, నెలకు రూ.3 లక్షల వరకూ డీజిల్‌కే ఖర్చవుతోంది. రొయ్యల పంట చేతికి రావడానికి 4 నెలలు పడుతుంది. అంటే ఈ నాలుగు నెలల్లో డీజిల్‌ కోసమే వనామీ రైతులకు రూ.12 లక్షల మేర చేతి చమురు వదిలిపోతోంది. అదే కరెంటు సరఫరా సక్రమంగా ఉంటే నెలకు రూ.25 వేలు మాత్రమే అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆక్వాకు నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలని, ఆక్వా ఫీడర్లకు విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement