రత్నగిరికి ప్రసాదమే సిరి | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి ప్రసాదమే సిరి

Jul 15 2026 1:46 AM | Updated on Jul 15 2026 1:46 AM

సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

ఆషాఢంలో విక్రయాలకు

కౌంటర్లు పెంపు

ఆదాయం రూ.1.5 కోట్లు

వస్తాయని అంచనా

అన్నవరం: ముక్కోటి దేవతల ప్రసాదాలలో సత్య దేవుని ప్రసాదం ప్రత్యేకం. స్వామివారంటే భయభక్తులు ఉన్నవారెవరైనా స్వామిని దర్శించునే భాగ్యం లేకపోయినా బాధపడరు కానీ.. ప్రసాదం స్వీకరించకుండా వెళ్తే మాత్రం మనసులో చాలా బాధపడిపోతుంటారు. ఆషాఢం వచ్చిందంటే స్వామివారి ప్రసాదానికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అలాగని ఈ మాసంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని కాదు. ఆచార వ్యవహారాలకు ప్రధానమైన ఆషాఢ మాసంలో అన్నవరానికి అటూ, ఇటూ, సమీపంలో ఉండే ఆలయాల దర్శనాలకు వెళ్లే భక్తులు రత్నగిరి, హైవేపై ఉన్న నమూనా ఆలయం మీదుగా రాకపోకలు సాగించేటపుడు కొద్దిసేపు ఆగి ఆయా కౌంటర్లలో ప్రసాదం కొనుక్కుని వెళ్లిపోతుంటారు. దీంతో ఏటా ఈ మాసంలో ప్రసాదం విక్రయాలు విపరీతంగా ఉంటాయి. లోవకొత్తూరులోని తలుపలమ్మ తల్లి, పెద్దాపురం మరిడమ్మ తల్లి, ఇతర గ్రామదేవతలకు ఈ నెలంతా జాతరలు ఉంటాయి. దీంతో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలు, శని, ఆది వారాలు మినహా సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని సత్యదేవుని ఆలయంలో అధిక ప్రసాద విక్రయాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆది, మంగళ, గురు, శుక్రవారాలలో లోవతల్లి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఆదివారం మాత్రం ఆ సంఖ్య సుమారు 50 వేల నుంచి లక్ష ఉంటుంది. వీరిలో చాలా మంది స్వామివారి ప్రసాదాన్ని కొనుక్కుంటారు. ఈ నేపథ్యంలో నాలుగు ఆదివారాల్లో సుమారు రూ.కోటి వరకు స్వామివారి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో 60 వేల ప్యాకెట్లు, ఆదివారం పాత నమూనా ఆలయం కౌంటర్‌ వద్ద 30 వేలు, తొలిపాంచా కౌంటర్‌ వద్ద 30 వేలు రత్నగిరి కౌంటర్ల వద్ద 30వేలు కొత్త నమూనా ఆలయం వద్ద పది వేల ప్రసాదం ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement