● ఆచారాలకు సంప్రదాయాలకు నెలవైన మాసం
● ప్రతి ఆచారం వెనుక
ఎంతో శాసీ్త్రయత
ఆలమూరు: తొలకరి జల్లులతో ప్రకృతి శోభించే మాసం ఆషాఢం. శుభ కార్యాలు లేకపోయినా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఇది ఎంతో శుభప్రదమైనది. గ్రామ దేవతలకు జాతరలు, నైవేద్యాల సమర్పణకు నెలవైన కాలం. మేఘావృతమైన ఆకాశాలు.. చిరు జల్లుల సందోహాలు.. మునగాకు వంటకాల ఘుమఘుమలు.. నవ వధువులు గోరింట పంటలతో.. అంతే కాదు.. భావి జీవితం బాగుండాలని పెద్దల నిర్ణయం మేరకు వీడలేక వీడలేక నవదంపతులు ఎవరి పుట్టిళ్లకు వారు దారితీసే కాలమిదే. గ్రామీణాల్లో ఇవన్నీ సర్వ సాధారణమే అయినా ఇందులోని ప్రతి సంప్రదాయానికీ ఓ శాసీ్త్రయత నిమిడి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెపుతారు.
మునగాకు దివ్యౌషధం
ఆషాడ మాసంలో మునగాకుతో కూడిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఉష్ణ తత్వాన్ని పెంచి ప్రస్తుత శీతల వాతావరణానికి అనుగుణంగా సమతుల్యం చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. అంతే కాదు దీనివల్ల లభించే పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది.
గోరింటాకుతో ప్రయోజనాలు అనేకం
ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు లేదా పారాణి పెట్టుకోవడాన్ని అందానికే కాదు లక్ష్మీప్రదంగా కూడా భావిస్తారు. ఇది కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు నేడు మెహిందీ పేరుతో పట్టణాలకూ విస్తరించింది. గ్రీష్మం వెళ్లి వర్ష రుతువు ప్రవేశిస్తుంది. వర్షాలు పడే కాలం కావడంతో ఇంటి పనులు, పొలంపనులు చేసే మహిళలు తడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. వారి కాళ్లకు, చేతులకు, గోళ్లలో పగుళ్లకు గోరింటాకు కానీ, పారాణి కానీ దివ్యౌషధంగా పని చేస్తుందని.
పండగలకు విశేష ప్రాధాన్యం
ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచే పండగలు వరస కడతాయి. ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే అనంత ఫలితం ఉంటుందన్నది పురాణ వచనం. సూర్య భగవానుడు దక్షిణాయణంలోకి ప్రవేశించడం ద్వారా ఈ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. జైనులు ఈ నెలలోనే చాతుర్మాస వ్రతం చేపడతారు. జగన్నాథుడి రథయాత్ర, బోనాల పండగ, వారాహి నవరాత్రులు ఈ నెలలోనే వస్తాయి. దుర్గమ్మ శాకంబరిగా దర్శించునే భాగ్యం కలిగేది ఈ నెలలోనే కావడం విశేషం.


