పంపాలో మునిగి ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

పంపాలో మునిగి ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

Jul 15 2026 1:46 AM | Updated on Jul 15 2026 1:46 AM

స్నేహితులతో సత్యదేవుని

దర్శనానికి వచ్చిన వైనం

మృతుడు భీమవరం వాసి

అన్నవరం: స్నేహితులతో కలిసి స్థానిక పంపా నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఇంజినీరింగ్‌ విద్యార్థి కె.బాల సాత్విక్‌ (21) నీటిలో మునిగి మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే వెడితే ఏలూరుకు చెందిన బాలసాత్విక్‌ భీమవరంలోని డీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సవరం చదువుతున్నాడు. సోమవారం స్థానిక గ్రామదేవత మరిడమ్మ జాతరకు స్నేహితులతో కలసి అన్నవరం వచ్చాడు. రాత్రి జాతరలో పాల్గొని మంగళవారం స్నేహితులతో కలిసి సత్యదేవుని దర్శించి అనంతర పంపాలో స్నానాల ఘాట్‌ వద్ద స్నేహితులతో కలసి స్నానం చేస్తూ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారిచ్చిన సమచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఫైర్‌ సిబ్బందిని పిలిపించారు. వారు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): ఇద్దరు స్నేహితుల మద్య ఘర్షణ తలెత్తడంతో కత్తిపోట్లకు గురై ఒకరు మృతి చెందిన ఘటన పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ పేటకు చెందిన లింగం అర్జునుడుపై (30) బచ్చల మారుతి పవన్‌ అనే యువకుడు మంగళవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. అర్జునుడు పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరు మరి కొందరు స్నేహితులతో కలిసి దారపాలెం వాటర్‌ ఫాల్స్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇంటికి వచ్చిన తరువాత కూడా ఘర్షణ జరగడంతో మారుతి పవన్‌ కత్తితో అర్జునుడిపై దాడి చేశాడు. మృతుడు అర్జునుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

పెందుర్తి: మండలం సరిపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన కీర్తి మాణిక్యాలరావు(56) శనగ పొట్టు వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గొల్లప్రోలులో బొలెరో వాహనం అద్దెకు తీసుకుని కొంత పొట్టు అనకాపల్లిలో, మరికొంత ఆనందపురంలో అన్‌లోడ్‌ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. సరిపల్లి వద్దకు వచ్చే సరికి బొలెరో డ్రైవర్‌ నాగరాజు ముందు ఉన్న లారీని తప్పించే క్రమంలో ట్రాఫిక్‌ మధ్యలో వాహనాన్ని ఉంచాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న లారీ అదుపు తప్పి బొలెరోను ఢీ కొట్టింది. దీంతో బొలెరో ముందున్న మరో లారీని బలంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న మాణిక్యాలరావు కేబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ నాగబాబు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మాణిక్యాలరావుకు భార్య లలిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెందుర్తి పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాలుడి మృతి

ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తి గ్రామంలో గత నెల 14న పిచ్చికుక్క దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం మృతిచెందాడు. లింగంపర్తి గ్రామంలో సత్రం పంపు కాలనీకి చెందిన భీశెట్టి లక్ష్మణ్‌, లక్ష్మి దంపతుల కుమారుడు భీశెట్టి సాయిగణేష్‌ను (7) నెలరోజుల క్రితం పిచ్చికుక్క కరిచింది. ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో బాలుడికి రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించారు. మూడు రోజుల క్రితం సాయిగణేష్‌ అనారోగ్యానికి గురికావడంతో ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిగణేష్‌ మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement