గద్వాల న్యూటౌన్: వీబీజీ రాంజీ పథకం కింద జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 125 రోజుల పని కల్పించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శనివారం జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఏపీఓలు, ఈసీలు, మేటీలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా టీఓటీ శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కువ పనులకు ఎప్పటికప్పుడు ఎస్టిమేట్లు వేసి, ప్రతి కూలీకి సకాలంలో పని కల్పించేలా సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు. శిక్షణలో భాగంగా మేటీల విధులు, బాధ్యతలు, ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు, క్షేత్రస్థాయిలో చేపట్టే కొలతలు, పని పరిమాణం, లెక్కించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం నుంచి అన్ని మండలాల్లో మేటీలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, డీటీసీ విద్యాధర్, ఏపీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి..
ధరూరు: జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరు పంట కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మండలంలోని ఓబులోనిపల్లి, ర్యాలంపాడు గ్రామాల్లో పర్యటించి.. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయా.. లేదా.. అని పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న వీబీజీ రాంజీ పథకం పనులను, గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.


