సాక్షి, హైదరాబాద్/ గద్వాల క్రైం/ అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సమీకృత కోర్టు భవన సముదాయం నిర్మాణ పనులను ఏమాత్రం జాప్యం చేయకుండా చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత కోర్టు ప్రాంగణంలోనూ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కోర్టుల్లో మహిళా న్యాయవాదులకు తగిన వసతులు ఏర్పాటు చేయాలని సూచించింది. గద్వాల జిల్లా కోర్టు సమీకృత భవన సముదాయం నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, పనులు ప్రారంభించకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది సైఫుల్లా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది పూజారి శ్రీలేఖ వాదనలు విన్న ధర్మాసనం. కోర్టు భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన నిధులు, ఇతర అనుమతులు మంజూరైన నేపథ్యంలో నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ప్రస్తుత కోర్టు ఆవరణలో న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా న్యాయవాదులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం, ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది.
నూతన కోర్టు భవన నిర్మాణ పనుల పరిశీలన
నూతన జిల్లా కోర్టు సముదాయాల భవన నిర్మాణ స్థల, పనులను శనివారం హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ పరిశీలించారు. గద్వాల మండలంలోని పూడూరు గ్రామ శివారులో ప్రభుత్వం భవన నిర్మాణ పనులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడ జరుగుతున్న పనులు, ఎంత మేర విస్తీర్ణంలో పనులు చేపడుతున్న అంశాలపై కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్‌ను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అనుకున్న గడువులోగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. న్యాయమూర్తి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి, అదనపు న్యాయమూర్తి శ్రీనివాసులు, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు, అదనపు సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు లక్ష్మి, వెంకటేష్, నిష్కాపాత్రుడు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య తదితరులున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అలంపూర్ క్షేత్ర ఆలయాలను హైకోర్టు జడ్జి పుల్లా కార్తీక్, జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తి, జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజతో కలిసి శనివారం దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జోగుళాంబదేవిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.


