బీమాపై అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

బీమాపై అనాసక్తి

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

గద్వాల వ్యవసాయం: జీవాల (గొర్రెలు, మేకలు) బీమా పథకం ధీమా ఇవ్వడం లేదు. అసలు బీమా చేయించడానికి పెంపకదారులే వెనకడుగు వేస్తున్నారు. బీమాలో భాగంగా వేస్తున్న ట్యాగ్‌ల వల్ల జీవాలకు గాయాలు కావడంతోపాటు.. మృతిచెందిన తర్వాత అడిగే ఫొటోలు ఇవ్వలేమని నిర్ణయించుకొని అసలు జీవాలకు బీమా వద్దని పెంపకందారులు పశుసంవర్ధక శాఖ అధికారులకు తేల్చిచెబుతున్నారు. దీంతో చేసేది లేక బీమా ట్యాగ్‌లను అధికారులు వెనక్కి పంపారు.

6 నెలల నుంచి నాలుగేళ్ల వయసు..

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత వ్యవసాయ బీమా కంపెనీ (అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా, ఏఐసీ) ద్వారా జీవాలకు బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు ఇన్సూరెన్స్‌ క్లెయిం అయ్యేలా పథకాన్ని రూపొందించారు. ప్రీమియంలో 50 శాతం శాతం డబ్బును కేంద్రం, 35 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మిగలిన 15 శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. బీమా 6 నెలల నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న గొర్రెలు, మేకలు, పొట్టేళ్లకు చేయించవచ్చు. ఒక్కో పెంపకందారుడు వంద జీవాల వరకు బీమా చేయించడానికి అవకాశం కల్పించారు. ప్రీమియం రేటు 2.95 శాతంగా ఉంది.

నిబంధనలు, ప్లాస్టిక్‌ ట్యాగ్‌లు..

జీవాలకు బీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. ఇక్కడ సక్సెస్‌ అయితే రాష్ట్రం మొత్తం అమలు చేయాలని భావించింది. బీమా పథకాన్ని గడిచిన సెప్టెంబర్‌ రెండో వారంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఇక్కడ ఆరంభించారు. పథకంపై విస్తృత ప్రచారం కల్పించారు. అయితే బీమా చేసే జీవాల చెవులకు పశువైద్యాధికారులు ప్రత్యేకంగా ట్యాగ్‌లు వేయాలి. ట్యాగ్‌ నంబర్‌ కనిపించేలా జీవాల తల ఫొటోతోపాటు వాటి శరీరం అంతా కనిపించే విధంగా కుడి, ఎడమ వైపుల నుంచి మరో రెండు ఫొటోలు తీయాలి. ఈ మూడు ఫొటోలతోపాటు పెంపకందారుని ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. ఇక్కడే తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. జీవాలకు వేసే ట్యాగ్‌లు ప్లాస్టిక్‌వి కావడం, అవి కూడా పెద్దగా ఉండటంతో.. పశువైద్యాధికారులు ట్యాగ్‌లు వేసి, ప్రెస్‌ చేసే సమయంలో చెవులకు గాయాలు అవుతున్నాయి. పెద్ద రంద్రం ఏర్పడి అవి త్వరగా మానడం లేదు. పెంపకందారులు బీమా చేయించకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే ఒకవేళ జీవాలు మృతి చెందితే క్లెయిమ్‌ చేయడానికి ట్యాగ్‌ నంబర్‌ కనబడేలా తల ఫొటో, కుడి, ఎడమ వైపుల నుంచి మరో రెండు ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. అలా చేస్తేనే క్లెయిం వస్తుంది. ఈ నిబంధనను సైతం పెంపకందారులు వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా జీవాలను మేపడానికి గడ్డి ఉన్న ప్రదేశాలు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్తారు. జిల్లాలోని ధరూరు, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్‌, గద్వాల, అయిజ మండలాల పెంపకందారులు కర్ణాటకలోని రాయచూర్‌ శివారు ప్రాంతాలకు, మిగిలిన మండలాల వారు కూడా దూర ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవాల ఫొటోలు ట్యాగ్‌ నంబర్‌ కనబడేలా తీయడం, వాటిని ఫోన్‌ ద్వారా పంపించడం ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. దీనికితోడు బీమా చేసినప్పుడు, మృతిచెందినప్పుడు పంపే ఫొటోలు సరిగా ఉండాలి. ఇదంతా అంత సులువు కావని, బీమా చేసినా ప్రయోజనం లేదని కాపరులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 6,700 మంది పెంపకందారులు ఉంటే కేవలం 23 మంది మాత్రమే బీమా చేయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 321 జీవాలకు ట్యాగ్‌లు వేసిన తర్వాత బీమా మాకొద్దు అని సంబంధిత పెంపకందారులు వెనక్కి వెళ్లారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎవరూ బీమా చేయించడం లేదని అధికారులు గ్రహించి ట్యాగ్‌లను వెనక్కి పంపించారు.

జిల్లాలో జీవాల బీమాకుముందుకు రాని పెంపకందారులు

సాంకేతిక నిబంధనలు కష్టతరంగా ఉన్నాయని భావన

ట్యాగ్‌లతో జీవాల చెవులకు గాయాలు కావడంతో వెనకడుగు

సామగ్రిని తిరిగి పంపిస్తున్న జిల్లా అధికారులు

జోగుళాంబ జిల్లాను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement