ప్రమాదాల నివారణకు చర్యలు..
గద్వాల: రాబోయే రబీ సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించించాలని, ఆ దిశ గా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్‌జాజు నిర్వహించిన వీసీలో పాల్గొని అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. రైతులను ఉద్యాన, ఆయిల్‌పాం, సూక్ష్మసేద్య పంటలు సాగువైపు ప్రోత్సహించాలన్నారు. పాఠశాలలో వి ద్యార్థులు వందశాతం హాజరు ఉండాలని, అలాగే ఉపాధ్యాయలు, సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రా జెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వీధికుక్కల సమస్యను సుప్రీంకోర్టు జారీ చేసిన మర్గాదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలని చెప్పారు. వీబీజీ రాంజీ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ పని కల్పించాలన్నారు. అలాగే భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులను విస్తృతంగా చేపట్టాలని, అన్ని సాగునీటి కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారితోపాటు అంతర్రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లోనూ ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, అసంపూర్తిగా ఉన్న రహదారుల పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఆర్టీఓ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, పోలీసు, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను అరికట్టాలన్నారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్‌డీసీ కృష్ణ, ఏఎస్పీ శంకర్, డీటీఓ రాధిక, ఈఈ ప్రగతి తదితరులు పాల్గొన్నారు.


