ఉండవెల్లి: గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీపీఓ శ్రీకాంత్ అన్నారు. గురువారం స్థానిక మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల భోజన వసతి, బియ్యం నాణ్యత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. బియ్యం నాణ్యత లేక భోజనం మామూలుగా ఉంటే విద్యార్థినులు ఎలా తింటారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లోపించిన బియ్యాన్ని వెనక్కి పంపించాలని సూచించారు. అనంతరం ఉండవెల్లి పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ తిరుపతన్న ఆధ్వర్యంలో డీపీఓ, పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి జలసిరి కార్యక్రమంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే డీపీఓ, ఓ పంచాయతీ కార్యదర్శికి వెంచర్ విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కార్యక్రమంలో ఎంపీఓ ఖాజా, సర్పంచు నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


