కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

గద్వాల క్రైం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బందికి రూ.26 వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. కొత్తగా విధుల్లో చేరే కార్మికులకు రూ.16 వేల వేతనం నిర్ణయించిన నేపథ్యంలో.. సుదీర్ఘకాలంగా అనుభవంతో పనిచేస్తున్న కార్మికులకు రూ.26 వేల వేతనం చెల్లించాలన్నారు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సెలవులు అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి రెండు జతల యూనిఫాంలు ఇవ్వాలన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సొమ్ము ఖాతాల్లో జమచేయడం లేదని, ప్రతినెలా 1న జీతం అందజేస్తామని ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కారని విమర్శించారు. కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం, ఇతరత్రా అలవెన్స్‌లు తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రంగన్న, వెంకటరామిరెడ్డి, ఆశన్న, కృష్ణ, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement