కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన శేషవాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదిశేషుడిపై కొలువుదీరిన శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కురుమూర్తి గిరులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రధానాలయం నుంచి పల్లకీ సేవ ప్రారంభమైంది. దాసులు భక్తిశ్రద్ధలతో ఉత్సవమూర్తిని పల్లకిలో మోస్తూ ఒంటిపాదం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ సాగిన ఈ ఊరేగింపు తిరుమల తిరుపతి పురవీధుల్లో జరిగే వాహన సేవలను తలపించింది. మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా అంటూ నామస్మరణ చేశారు. భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. కార్యక్రమంలో చైర్మన్ బత్తుల బాలరాజు, సురేందర్‌రెడ్డి, వావిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
– చిన్నచింతకుంట


