గద్వాల క్రైం: జిల్లాలో మధుమేహం.. రక్తపోటు బాధితులు పెరిగిపోతున్నారు. వారికి తెలియకుండానే ఆయా రోగాల బారినపడుతున్నారు. ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా జిల్లా ఆరోగ్య శాఖ నిర్వహించిన ఎన్‌సీడీ (నాన్ మ్యూనికేబుల్ డిసీజెస్) సర్వేలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో బీపీ, డయాబెటిస్ వ్యాధులపై క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో 43,486 మంది బీపీ, డయాబెటిస్ 22,765 మంది బాధితులు ఉన్నారు. మధుమేహంపైకి పెద్దగా ఎలాంటి లోపాలు కనిపించకుండా శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతిస్తున్నాయి. వైద్యులు మాత్రం ఈ వ్యాధి మరెన్నో వ్యాధులకు బీజం వేస్తుందని చెబుతున్నారు.
ప్రాథమిక దశలో..
ప్రాథమిక దశలో గుర్తించలేకపోతే ప్రాణాంతక వ్యాధులు మానవాళికి ముప్పు తీసుకువస్తున్నాయి. మానవ శరీరంలోని ప్రతి కణానికి గ్లూకోజ్ ఎంతో అవసరం. అయితే మనం తీసుకునే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి రక్తం ద్వారా శరీరంలోని కణాలన్నింటికీ సరఫరా అవుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరంలోని కణాలు గ్రహించడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం ఉంటుంది. ఇన్సు లిన్ సక్రమంగా ఉత్పత్తి కాకపోయినా.. ఉత్పత్తి అ యిన దానిని సమర్థంగా వినియోగించకపోయినా రక్తంలోని గ్లూకోజ్ శరీరంలోని కణాలు గ్రహించలేవు. ఈ క్రమంలో గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోవడం కారణంగా మధుమేహానికి దారి తీస్తుంది.
పెరుగుతున్న బాధితులు..
సాధారణంగా బీపీ, షుగర్ బాధితులు ధనిక వర్గాలకు మాత్రమే సంక్రమించేదిగా ఉండేది. తాజాగా పట్టణ, పల్లె, పేద, ధనిక తేడా లేకుండా అందరినీ కబళిస్తుంది. జిల్లాకేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ బీపీ, షుగర్‌తో ఇబ్బందులు పడుతున్నారు. వీరి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. సిబ్బంది సర్వేకు వెళ్లిన క్రమంలో ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ మందులు కనిపించడం సర్వసాధారణంగా మారింది. మందుల కొనుగోలు సైతం విపరీతంగా ఉంది. ప్రతిఒక్కరు నెలకు సరిపడా మందులను కొనుగోలు చేస్తున్నారు.
ఒత్తిళ్లు.. అలవాట్లు..
మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో చాలామంది రక్తపోటు బారిన పడుతున్నారు. అలాగే మధుమేహం సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు తమ జీవనశైలిలో మార్పులు సరి చేసుకోవాల్సిందిగా వివిధ సందర్భాల్లో వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని, వైద్యుల సూచనలు తీసుకోవాలని వివరిస్తున్నారు. ప్రతిరోజు నడక, వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని పేర్కొంటున్నారు. జంక్ ఫుడ్ కాకుండా పోషకాలు ఉండే మంచి ఆహారం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగామించవచ్చని, అనవసర ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండాలని సూచిస్తున్నారు.
జిల్లాలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు
సర్వేలో వెలుగుచూస్తున్న బీపీ, షుగర్ బాధితులు
పరీక్షలలో రక్తపోటు.. మధుమేహం సమస్యలే అధికం
ఒత్తిళ్లు.. ఆహారపు అలవాట్లతో పెరుగుతున్న ముప్పు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ


