గద్వాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువుల ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రచార పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వారు పాతబస్టాండులోని వైఎస్సార్ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టి ప్రజలపై భారాన్ని తగ్గించాలని, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అవినీతి, అణచివేత, విద్వేషపూరితమైన బీజేపీ పాలన పోవాలని నినదించారు. మతతత్వ విధానాలు, రాజకీయాలను విడనాడాలని, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక, రైతు, యువజన సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆశన్న, భరత్, నాగార్జున, రాజు, వెంకటేష్, నాగరాజు, వెంకటేష్, ఆంజనేయులు, వెంకట్రాములు, నారాయణ పాల్గొన్నారు.
అఖండ సప్తాహా భజన
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అఖండ సప్తాహ భజనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భజన మండలి సభ్యులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారం రోజులపాటు కొనసాగనున్న ఈ భజనలను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. భజన మండలి సభ్యులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.


