గద్వాల: మండల స్థాయిలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించిందన్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా, డివిజన్ స్థాయిలో ప్రజావాణి కొనసాగుతుండగా.. మండల స్థాయిలోనూ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే సోమవారం నుంచి అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలాల్లోనే ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అక్కడిక్కకడే పరిష్కరించేలా చర్యలు చేపడుతామన్నారు. దీని వల్ల ప్రజలకు ప్రయాణ భారం తగ్గడంతోపాటు సమయం కూడా వృథా కాదన్నారు. మండల స్థాయి ఆపరేటర్లు, సూపరింటెండెంట్లు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజావాణిలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఫిర్యాదులు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా మండల స్థాయి అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. శిక్షణలో డీఆర్‌డీఓ, ఈ–జిల్లా మేనేజర్లు సిబ్బందికి ప్రజావాణి నిర్వహణ, ఫిర్యాదుల నమోదు, పరిష్కార ప్రక్రియ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.


