అయిజ: ఏపీలోని రాజమహేంద్రవరంలో హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌లో ఆమె ప్రియాంక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న జరిగిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసిందన్నారు. ఒక సాధారణ పౌరుడు కష్టపడి ముగ్గురు ఆడపిల్లలను చదివిస్తున్నారని.. ప్రియాంకను డాక్టర్ చేయాలనే లక్ష్యంతో చదివిస్తుంటే, ఇద్దరు దుర్మార్గులు వారి ఆశలన్నింటిని బుగ్గిపాలు చేశారన్నారు. ఈ ఘటనలో కొందరు దోషులను కాపాడే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మీడియా కదిలించేంత వరకు అక్కడున్న పోలీసులు, కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎందుకు మాట్లాడలేదని.. సీసీ ఫుటేజీలను ఎందుకు బహిర్గతం చేయలేదని ఆమె ప్రశ్నించారు. ప్రియాంక హత్య కుట్ర వెనుక ఎవరున్నారో చెప్పాలన్నారు. ఏపీ ప్రభుత్వం సామాన్యులకు ఎలాంటి రక్షణ కల్పించదా అని ప్రశ్నించారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరగకుంటే చేనేత సామాజిక వర్గం మొత్తం రాజమహేంద్రవరంలో రోడ్డెక్కుతారని హెచ్చరించారు. బుట్టా రేణుక వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.


