ఏటీసీ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

ఏటీసీ సెంటర్లతో యువతకు ఉపాధి అవకాశాలు

Aug 17 2026 1:17 AM | Updated on Aug 17 2026 1:17 AM

రాష్ట్ర కార్మిక, ఉపాధి, కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి

చిన్నచింతకుంట: యువతకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర కార్మిక, ఉపాధి, కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పల్లమర్రి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట వద్ద అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) నిర్మాణానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మారుమూల ప్రాంత యువతకు సైతం ఆధునిక విద్య, సాంకేతిక నైపుణ్యాలను అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఇందులో భాగంగానే రాష్ట్రంలో రూ.4 వేల కోట్లతో 119 ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసి.. 65 ఐటీఐలను ఆధునికీకరించినట్లు వెల్లడించారు. ఈ సెంటర్ల ద్వారా రోబోటిక్స్‌ ఆధునిక యంత్రాల నిర్వహణ, ఆగ్రో ప్రాసెసింగ్‌ తదితర సాంకేతిక అంశాలలో శిక్షణ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించి వారికి మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏటీసీ కేంద్రాలు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. ఏటీసీ సెంటర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత యవతకు ఆధునిక సాంకేతిక రంగాలలో శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. శిక్షణ పొందిన యువతకు విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏటీసీని విస్మరించిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని కార్మికులను, వారి సంక్షేమాన్ని విస్మరించి మహారాష్ట్రలో రూ.500 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ రాజేష్‌, జాయింట్‌ డైరెక్టర్‌ నరేష్‌, రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement