మిర్చి రైతు గోస తీరేనా? | - | Sakshi
Sakshi News home page

మిర్చి రైతు గోస తీరేనా?

Aug 17 2026 1:17 AM | Updated on Aug 17 2026 1:17 AM

గద్వాల వ్యవసాయం: మిర్చి సాగు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితిని నడిగడ్డ రైతులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా అన్ని పంటలను విక్రయించడానికి మార్కెటింగ్‌ సౌకర్యం.. లేదా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎండుమిర్చి విక్రయాలకు మాత్రం మార్కెటింగ్‌ సౌకర్యం లేక రైతులు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. వ్యయ, ప్రయాసాలకోర్చి పండించిన ఎండుమిర్చిని దళారులకు విక్రయిస్తూ.. ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారు. జిల్లాలో ఏటా వేల ఎకరాల్లో ఎండుమిర్చి సాగు అవుతున్నా.. మార్కెటింగ్‌ (మిర్చి యార్డు) ఏర్పాటుపై అటు పాలకులు, ఇటు అధికారులు దృష్టి సారించడంలేదు.

ఏటా 25వేల నుంచి 65వేల ఎకరాల వరకు..

ఇక్కడి రైతులు 15 ఏళ్లుగా ఎండుమిర్చి సాగుపై మక్కువ చూపుతున్నారు. బోర్లు, బావుల కిందతో పాటు నల్లరేగడి భూముల్లో వర్షాధారంపై మిర్చి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి.. పంట బాగా చేతికొస్తే, పత్తి కన్నా మిర్చికి మంచి ధరలు లభిస్తాయన్న ఉద్దేశంతో రైతులు మిర్చి సాగుపై మక్కువ చూపుతున్నారు. ఏటా 25వేల నుంచి 65వేల ఎకరాల వరకు ఎండుమిర్చి సాగవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ. 60వేల నుంచి రూ. 70వేల వరకు సాగుఖర్చులు అవుతాయి. కరుణ, సూపర్‌టెన్‌, జిత్రి, కావేరి, తేజచిల్లి, బ్యాడిగ తదితర రకాలను ఎక్కువగా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి వానాకాలం జూలై, ఆగస్టు నెలల్లో మిర్చి నారును నాటుతారు. జనవరి చివరి వారం నుంచి పంట చేతికొస్తుంది.

రైతులకు తప్పని కష్టాలు..

జిల్లాలో మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో ఏటా ఎండుమిర్చి రైతులు కష్టాలు పడుతున్నారు. పంట దిగుబడులు బాగా వచ్చినా.. రైతులు మాత్రం ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ మార్కెట్‌ సౌకర్యం లేకపోవడమే. రైతులు చేసేదిలేక కర్ణాటకలోని రాయచూర్‌, ఏపీలోని కర్నూలు, గుంటూరు లేదా హైదరాబాద్‌కు మిర్చిని తీసుకెళ్తున్నారు. ఇందుకోసం వేలాది రూపాయల రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఇది కాదనుకుంటే దళారులకు విక్రయించాలి. పంట చేతికొచ్చిన వెంటనే దళారులు వాలిపోతున్నారు. దూర ప్రాంతాల్లోని మార్కెట్‌కు తరలించలేని కొందరు రైతులు కల్లాల వద్దే విక్రయిస్తున్నారు. ఇక దళారులు మిర్చి రకాన్ని బట్టి మార్కెట్‌ ధర కన్నా.. క్వింటాకు రూ. 2వేల నుంచి రూ. 5వేల వరకు తక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 2023లో గద్వాల మార్కెట్‌యార్డులో వారంలో రెండు రోజులు ఎండుమిర్చి కొనుగోళ్లు జరిపారు. కొన్ని రోజులు మాత్రమే కొనుగోళ్లు కొనసాగాయి.

ఇప్పటికే 24 ఎకరాల్లో సాగు..

ఈ ఏడాది ఇప్పటికే 24వేల ఎకరాల్లో మిర్చి వేశారు. ఇంకా చాలాచోట్ల రైతులు బెడ్లలోనే మిర్చి నారు ఉంచారు. నీటి లభ్యత మేరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి.. జిల్లాలో మిర్చియార్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే వ్యాపారులతో మాట్లాడి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే మిర్చి రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

జిల్లాలో మార్కెటింగ్‌ సౌకర్యం లేక అవస్థలు

ఏటా విస్తారంగా ఎండుమిర్చి సాగు

దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించేందుకు వ్యయ, ప్రయాసాలు

దళారులకు విక్రయించి నష్టపోతున్న రైతులు

ఈ ఏడాదైనా మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement