రాజోళి: మండలంలోని మాన్‌దొడ్డిలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఆదివారం వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డీఏఓ వీరప్ప ఆధ్వర్యంలో ఎరువుల బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 47 డీఏపీ బస్తాలను అధికారులు గుర్తించి.. వాటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించడంతో పాటు ఆ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేయాలని సూచించారు. అదే విధంగా తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ సుబ్బారెడ్డి, ఏఓ సురేఖ, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.


