అలంపూర్: అలంపూర్ చౌరస్తాలో రూ. 2కోట్లతో నిర్మించతలపెట్టిన ఫైర్‌స్టేషన్ పనులకు బుధవారం ఎమ్మెల్యే విజయుడు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 30 గుంటల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో అగ్నిమాపక కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫైర్‌స్టేషన్ భవనంతో పాటు 25వేల లీటర్ల కెపాసిటీ గల రెండు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా అత్యవసర సమయంలో వినియోగించే స్టాటిక్ వాటర్‌ట్యాంక్ సైతం నిర్మించనున్నట్లు తెలిపారు. 9 నెలల వ్యవధిలోనే ఫైర్‌స్టేషన్ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే అగ్నిమాపకశాఖ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి అశోక్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఓ రాకేశ్, ఇన్‌చార్జి ఎస్‌ఎఫ్‌ఓ కురుమూర్తి, పోలీస్ హౌసింగ్ ఏఈ అనిల్ శాసీ్త్ర, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు.


