అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్‌కు భారీ బూస్ట్‌ | US SC Expands Trumps Presidential Powers Shields Fed Independence | Sakshi
Sakshi News home page

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ట్రంప్‌కు భారీ బూస్ట్‌

Jun 30 2026 6:51 AM | Updated on Jun 30 2026 6:55 AM

US SC Expands Trumps Presidential Powers Shields Fed Independence

అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వతంత్ర ఫెడరల్‌ ఏజెన్సీల అధిపతులను ఎలాంటి కారణం చెప్పుకుండానే తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. 91 ఏళ్ల నాటి కీలక న్యాయసూత్రాన్ని పక్కనబెట్టింది. తద్వారా అమెరికా అధ్యక్షుడి అధికారాలను గణనీయంగా విస్తరించేందుకు మార్గం సుగమం చేసింది.  

అదే సమయంలో.. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ స్వతంత్రతకు మాత్రం రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో గవర్నర్‌ లీసా కుక్‌ను వెంటనే తొలగించేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు వేసింది. ఈ రెండు తీర్పులు కలిసి అమెరికాలో అధ్యక్షుడి అధికారాలు, కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై కొత్త చర్చకు తెరలేపాయి.

స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం ఈ తీర్పులు  వెలువడ్డాయి. ఈ తీర్పుపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష అధికారాలకు సంబంధించిన అత్యంత కీలక తీర్పుల్లో ఇదొకటని పేర్కొన్నారు. అయితే లీసా కుక్‌ కేసులో సాంకేతిక కారణాలతో మాత్రమే తీర్పు వచ్చిందని, ఆమెపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

దశాబ్దాల.. న్యాయసూత్రానికి ముగింపు
ఫెడరల్‌ ఏజెన్సీల అధిపతుల్ని తొలగించే కేసులో.. 6-3 మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1935లో వచ్చిన హంపేరీస్‌ ఎగ్జిక్యూటర్‌ Humphrey's Executor తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పు ప్రకారం ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (FTC) వంటి స్వతంత్ర సంస్థల సభ్యులను అధ్యక్షుడు విధానపరమైన విభేదాల కారణంగా తొలగించలేడు. ఇప్పుడు ఆ పరిమితిని తొలగిస్తూ.. అలాంటి రక్షణలు రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ స్పష్టం చేశారు. దీంతో అధ్యక్షుడికి స్వతంత్ర ఫెడరల్‌ సంస్థలపై మరింత నియంత్రణ లభించినట్టైంది.  

ఏయే సంస్థలపై ప్రభావం?
ఈ తీర్పు ప్రభావం కేవలం ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌కే పరిమితం కాదు. నేషనల్‌ లేబర్‌ రిలేషన్స్‌ బోర్డ్‌ (NLRB), మెరిట్‌ సిస్టమ్స్‌ ప్రొటెక్షన్‌ బోర్డ్‌, కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ వంటి అనేక స్వతంత్ర సంస్థల బోర్డు సభ్యులను కూడా అధ్యక్షుడు అవసరమైతే పదవి నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో వైట్‌హౌస్‌ ప్రభావం ఈ సంస్థలపై మరింత పెరిగే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫెడరల్‌ రిజర్వ్‌కు మాత్రం.. 
అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయగా భావించే ఫెడరల్‌ రిజర్వ్‌ విషయంలో సుప్రీంకోర్టు భిన్నమైన వైఖరి తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఫెడ్‌ గవర్నర్‌ లీసా కుక్‌ను వెంటనే తొలగించాలన్న అభ్యర్థనను 5-4 మెజారిటీతో తిరస్కరించింది. చట్టం కల్పించిన విధివిధానాలు పాటించకుండా ఆమెను తొలగించలేరని స్పష్టం చేసింది. కేసు పూర్తయ్యే వరకు లీసా కుక్‌ పదవిలో కొనసాగవచ్చని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ తన తీర్పులో ఫెడరల్‌ రిజర్వ్‌ చరిత్రను ప్రస్తావిస్తూ.. ఈ సంస్థ రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ ప్రత్యేక రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. అధ్యక్షుడి ఇష్టానుసారంగా గవర్నర్లను తొలగించే అవకాశం ఉంటే, వడ్డీ రేట్లపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు.  

లీసా కుక్‌పై ఆరోపణలు ఏమిటి?
2025 ఆగస్టులో ట్రంప్‌, లీసా కుక్‌పై మార్ట్‌గేజ్‌ మోసం ఆరోపణలు చేస్తూ ఆమెను తొలగించే ఉత్తర్వులు జారీ చేశారు. మిషిగన్‌, జార్జియా రాష్ట్రాల్లోని రెండు ఇళ్లను ఒకేసారి ప్రధాన నివాసంగా చూపించి గృహ రుణాల్లో అక్రమ ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. అయితే ఇవి నిరూపితం కాని ఆరోపణలేనని, అసలు ఉద్దేశం తనను వడ్డీ విధానంపై రాజకీయ ఒత్తిడికి లోను చేయడమేనని లీసా కుక్‌ ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్‌ కేసు నమోదు కాలేదని కూడా స్పష్టం చేశారు.

ట్రంప్‌ లక్ష్యం వేరే.. 
తన రెండో అధ్యక్ష పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్‌ వడ్డీ రేట్లు వేగంగా తగ్గించాలని ఫెడరల్‌ రిజర్వ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లతో ప్రభుత్వ రుణభారం తగ్గడమే కాకుండా, గృహ, వాహన రుణాలు కూడా చౌకవుతాయని ఆయన వాదిస్తున్నారు. కానీ ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ విభేదాల నేపథ్యంలోనే కుక్‌, అలాగే మాజీ ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌పై ట్రంప్‌ ప్రభుత్వం ఒత్తిడి పెంచిందని విమర్శలు వచ్చాయి.  

పావెల్‌పై దర్యాప్తు కూడా..
ఫెడరల్‌ రిజర్వ్‌ మాజీ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌పై కూడా ట్రంప్‌ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఫెడ్‌ ప్రధాన కార్యాలయ భవనాల పునరుద్ధరణ వ్యయాల పేరుతో విచారణ చేపట్టినా, అది వడ్డీ రేట్లపై ప్రభావం చూపేందుకు చేసిన ప్రయత్నమేనని పావెల్‌ ఆరోపించారు. అనంతరం కోర్టు జోక్యంతో ఆ విచారణ నిలిచిపోయి, చివరకు అమెరికా న్యాయశాఖ దానిని ఉపసంహరించుకుంది.

ఒకవైపు అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను మరింత బలోపేతం చేస్తూనే, మరోవైపు ఫెడరల్‌ రిజర్వ్‌ వంటి అత్యంత కీలక ఆర్థిక సంస్థ రాజకీయ జోక్యానికి గురికాకుండా రక్షణ కల్పించింది. అమెరికా సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ రెండు తీర్పులు..  అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో కీలక మలుపుగా భావిస్తున్నారు. అధ్యక్ష అధికారాలు ఎంతవరకు ఉండాలి? స్వతంత్ర సంస్థల స్వేచ్ఛ ఎంతవరకు కాపాడాలి? అనే చర్చలకు ఈ తీర్పు కొత్త దిశ చూపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement