రష్యా నుంచి భారతదేశానికి వస్తూ ఇంగ్లీష్ ఛానెల్‌ను దాటుతున్న షాడో- ప్లీట్ అనే ఆయిల్ ట్యాంకర్‌ను బ్రిటన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ నౌక కెప్టెన్‌నైనా అజయ్ పంత్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆ కెప్టెన్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆయనను విడిపియ్యాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
"రష్యా (ఆంక్షలు) నిబంధనలు 2019" లోని 'రెగ్యులేషన్ 46Z9B' ని ఉల్లంఘిస్తూ.. రష్యా చమురును ఇతర దేశానికి ఓడ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సరఫరా చేసినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు.
అయితే ఆయన తరపున కేసు వాదించిన "ఈ నౌక ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి సరుకును తీసుకెళ్లాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఆయన కేవలం కార్పొరేషన్ (కంపెనీ) ఆదేశాలను మాత్రమే పాటించారు. ఆయన తన ఉద్యోగాన్ని చేసుకుంటున్న ఒక ఉద్యోగి మాత్రమే, ఇప్పుడు బ్రిటీష్ కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న అక్కడి కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది.
భార్య ఆవేదన
అజయ్ పంత్ భార్య.. రీతు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బ్రిటీష్ మీడియా నివేదికల ద్వారానే తన భర్త అరెస్ట్ విషయం తెలిసింది. UK లేదా భారత అధికారుల నుండి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పారు. ఆయన కేవలం కంపెనీ ఆదేశాల మేరకే నౌకను నడిపారని, ఇందులో ఆయన తప్పేమీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందన
దీనిపై ఉత్తరాఖండ్ హోం సెక్రటరీ శైలేష్ బగౌలీ స్పందిస్తూ.. పంత్ విడుదల మరియు పునరాగమనం కోసం సహాయం చేయాలని కోరుతూ రెండు రోజుల క్రితమే భారత విదేశాంగ శాఖ కు లేఖ రాశామని తెలిపారు. ఢిల్లీలోని తమ ప్రాంతీయ కమిషనర్ కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు. కాగా UKలోని భారత హైకమిషన్‌కు పంత్‌ను కలుసుకునేందుకు అనుమతి లభించింది..
కాగా బ్రిటన్ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. రాయల్ మెరైన్ కమాండోలు రాత్రి వేళల్లో 'చినూక్' హెలికాప్టర్ ద్వారా నౌకపైకి దిగారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు నౌకలోని పత్రాలను తనిఖీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని చెబుతూ, ఇది "రష్యాకు తగిలిన మరో దెబ్బ" అని అభివర్ణించారు.


