
రేపు అలస్కాలో భేటీ కాబోతున్న ఇరువురు నేతలు
చర్చల గదిలో ట్రంప్, పుతిన్ సహా మొత్తం నలుగురే
2018లో హెల్సింకీలో విఫలమైన గోప్య సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్‌తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది.
అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు.
కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం
పుతిన్‌తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్‌తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.
పుతిన్ విజయమే: బోల్టన్
అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్‌ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు.