
పుతిన్‌తో సమావేశమైన ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్‌తో చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్‌ను పంపించారు. విట్కాఫ్ బుధవారం ఉదయం మాస్కోలో పుతిన్‌తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. ట్రంప్ సందేశాన్ని విట్కాఫ్ ఈ సందర్భంగా పుతిన్‌కు చేరవేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సన్నద్ధం కావాలని, కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు.
పుతిన్, విట్కాఫ్ మధ్య సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని రష్యా విదేశాంగ ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు. ఇరుపక్షాలు సానుకూల సంకేతాలు పంపించుకున్నాయని వివరించారు. వ్యూహాత్మక సహకారంపై చర్చించుకున్నాయని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, పుతిన్‌తో చర్చల అనంతరం విట్కాఫ్ బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని రష్యన్ మీడియా తెలియజేసింది. అయితే, పుతిన్, విట్కాఫ్ తాజా చర్చలపై అమెరికా, ఉక్రెయిన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇకనైనా ఫుల్‌స్టాప్ పెట్టకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాను ట్రంప్ తీవ్రంగ హెచ్చరించిన సంగతి తెలిసిందే.