ఫార్మాపైనా.. టారిఫ్‌ పిడుగు | Trump warns against imposing heavy tariffs on pharma products | Sakshi
Sakshi News home page

ఫార్మాపైనా.. టారిఫ్‌ పిడుగు

Aug 9 2025 5:47 AM | Updated on Aug 9 2025 5:47 AM

Trump warns against imposing heavy tariffs on pharma products

ప్రస్తుతానికైతే సెక్షన్‌ 232 ప్రకారం ఫార్మాకు మినహాయింపు

కానీ.. భారీగా టారిఫ్‌లు తప్పవంటూ ట్రంప్‌ వార్నింగ్‌

ఇదే జరిగితే భారత కంపెనీలకు ఎదురుదెబ్బే

పోటీ పెరిగి... ఆదాయాలు 17–20 శాతం పడిపోయే ప్రమాదం

వ్యూహాత్మక టేకోవర్లు, స్థానిక కంపెనీలతో డీల్స్‌కు అవకాశం

కొన్ని భారత కంపెనీలకు పూర్తిగా అమెరికా మార్కెట్టే ఆధారం  

భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన అమెరికా... రష్యా నుంచి భారత్‌ భారీగా చమురు కొంటున్నదన్న కారణంతో మరో 25 శాతం పెనాల్టీ సుంకాలు కూడా విధించింది. వెరసి ఈ 50 శాతం సుంకాలూ ఈ నెల్లోనే అమల్లోకి రానున్నాయి. దీనివల్ల చాలా భారత కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచాలి. ఇలా పెంచితే మిగతా దేశాల నుంచి ఎదురయ్యే పోటీలో వెనకబడిపోవచ్చు. ఇవన్నీ పలు కంపెనీల ఆదాయాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

సెక్షన్‌ 232 ప్రకారం దిగుమతి సుంకాల నుంచి ఫార్మా సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉండటంతో ఫార్మా కంపెనీలు ప్రస్తుతానికి ధీమాగానే ఉన్నాయి. కానీ ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తామని, 250 శాతం టారిఫ్‌లు వేస్తామని ట్రంప్‌ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న పలు భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా జనరిక్‌ డ్రగ్‌ మార్కెట్లో భారత్‌ది ఏకంగా 33 శాతం వాటా. టారిఫ్‌లు గనక వర్తిస్తే మన కంపెనీలకు ఎదురయ్యే ఇబ్బందులపై ‘సాక్షి బిజినెస్‌’ ప్రత్యేక కథనమిది... – సాక్షి బిజినెస్‌ డెస్క్‌

ఇవీ.. మన సానుకూలతలు
» మన దేశంలో కార్మికుల వ్యయాలు తక్కువ. నిపుణుల లభ్యత ఎక్కువ. టెక్నాలజీ కూడా ఉంది. అందుకనే యూఎస్‌ ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు తయారు చేయగలుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మన కంపెనీలు గట్టి పోటీనివ్వగలుగుతున్నాయి.
»  అమెరికా మార్కెట్లో అమ్ముడుపోయే ప్రతి మూడు జనరిక్‌ ఔషధాల్లో ఒకటి భారత కంపెనీలు సరఫరా చేస్తున్నదేనంటే... కారణమిదే 
»  మన ఫార్మా రంగం గనక 25– 50 శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు మన ఔషధాలు అమెరికా మార్కెట్లో ప్రియమవుతాయి. ధరల పరంగా ఉన్న వెసులుబాటు తగ్గిపోతుంది. 
»  తక్కువ ధరలకే ఉత్పత్తులు విక్రయించే అవకాశం పోయినట్లయితే... పోటీలో వెనకబడే ప్రమాదం ఉంటుంది. తక్కువ మార్జిన్‌ ఉండే జనరిక్స్‌లో ఇది మరింత సుస్పష్టం.

ఆదాయం, లాభాలకు గండి
» చాలా ఫార్మా సంస్థల ఆదాయాల్లో అమెరికా మార్కెట్‌ వాటా 30–55 శాతం వరకు ఉంటోంది. 
»  అరబిందో ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్, సన్‌ఫార్మా, లుపిన్, సిప్లా, గ్లాండ్‌ ఫార్మా తదితర సంస్థలపై అధిక ప్రభావం పడుతుంది.
»  కనీసం 17 శాతం వరకు ఆదాయాలు తగ్గిపోతాయన్నది విశ్లేషకుల అంచనా.

ఏ దేశం నుంచి పోటీ ఉండొచ్చు?
చైనా
» యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియెంట్స్‌ (ఏపీఐ) మార్కెట్లో బలంగా ఉంది. 
» భారత ఫార్మా సంస్థలు ఫార్ములేషన్లపై ప్రధానంగా దృష్టి సారించడంతో ఏపీఐ మార్కెట్లో చైనా వాటా పెరిగింది.
» చైనా మందులపై అమెరికాలో నమ్మకం తక్కువ. కోవిడ్‌ తరవాత ఇది మరింత పెరిగింది కూడా.
» నాణ్యత, నమ్మకం, నియంత్రణల పరమైన అంశాల కారణంగా ఫార్మా విషయంలో భారత్‌ స్థానాన్ని చైనా భర్తీ చేయలేదు. 

మెక్సికో
»  అమెరికా మార్కెట్లోకి పన్నుల్లేకుండా వెళ్లగలగటం మెక్సికోకు ఉన్న సానుకూలత.
»  మెక్సికోలో జనరిక్స్‌ తయారీ సదుపాయాలు తక్కువే. గణనీయంగా ఎగుమతులు చేసే స్థాయిలో లేదు. దగ్గర్లో ఉండడం వల్ల, వాణిజ్య ఒప్పందాల వల్ల భవిష్యత్తులో మార్కెట్‌ను పెంచుకోగలదు.

పోలాండ్, తూర్పు యూరప్‌
»  కాంట్రాక్టు తయారీ పరంగా పోటీనిస్తున్నాయి. ఈయూ నియంత్రణపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.
»   భారత్‌తో పోల్చి చూస్తే తయారీ వ్యయాలు బాగా ఎక్కువ. కాకపోతే భౌగోళికంగా చూస్తే అమెరికా, ఈయూకు దగ్గర.
» డిమాండ్‌లో మార్పులతో కొంత లాభపడొచ్చు.

బంగ్లాదేశ్‌
» తక్కువ ఖర్చుకే జనరిక్స్‌ ఔషధాలు తయారు చేయడంలో బంగ్లాదేశ్‌ ముందుంది.
»  వెనకబడిన దేశాలకు కల్పించిన ‘ట్రిప్స్‌ వైవర్‌’ కారణంగా ప్రయోజనం పొందగలదు.
»  అయితే భారత్‌లో మాదిరి ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఇక్కడ చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు.
» కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎఫ్‌డీఏ ప్రమాణాలను అందుకోవటం అంత తేలిక కాదు. 

బ్రెజిల్‌
» ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫార్మా మార్కెట్‌. ఎగుమతి సదుపాయాలు తక్కువే. దేశీయంగా ఉన్న డిమాండ్‌ను అందుకోవటమే ఇక్కడి కంపెనీలకు కష్టం. కనుక భారత ఎగుమతులకు ముప్పు కాదు.

వ్యూహాత్మక అడుగులు
»  ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే... అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయటం.. అక్కడి కంపెనీలను కొనుగోలు చేయటం వంటి ప్రత్యామ్నాయాలను మన కంపెనీలు పరిశీలించే అవకాశం ఉంటుందన్నది నిపుణుల మాట. అరబిందో ఫార్మా ఇటీవలే యూఎస్‌కు చెందిన లానెట్‌ ఫార్మాను 250 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయడాన్ని ఈ కోణంలో చూడొచ్చు. 
»   ప్రత్యామ్నాయ మార్కెట్లలో... అంటే యూరప్, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లో అవకాశాలపై ఫార్మా కంపెనీలు దృష్టి పెట్టొచ్చు. 
»  అమెరికా మార్కెట్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు కొత్త ఆవిష్కరణలు, బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్‌ దిశగా కంపెనీలు అడుగులు వేయొచ్చు. 
» ప్రభుత్వాల మధ్య ఫార్మా డీల్స్‌ కోసం లాబీయింగ్‌ చేయొచ్చు.

అమెరికా వినియోగదారులపైనే భారం..
భారత ఫార్మా రంగంపై టారిఫ్‌లు విధించడం ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. అంతిమంగా అమెరికా వినియోగదారులపైనే భారం పడుతుంది. భారతీయ కంపెనీలు ఎక్కువగా మార్జిన్‌ లభించని అత్యంత చౌకైన జనరిక్స్‌ను తయారు చేస్తాయి. కాబట్టి, టారిఫ్‌లపరంగా భారం మోపితే అది అమెరికన్‌ వినియోగదారుల మీదే పడుతుంది. ఉత్పత్తి పరిమాణం, ఖరీదు తదితర అంశాలపరంగా భారత్‌ తరహా సామర్థ్యాలను సాధించాలంటే కనీసం 3–5 ఏళ్లు పట్టేస్తుంది. దేశీ సంస్థలకు 700 పైగా అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఉండగా, 12 శాతం ఆదాయాలను నిబంధనలను పాటించడంపై వెచ్చిస్తున్నాయి.  –నమిత్‌ జోషి, చైర్మన్, ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్‌

టారిఫ్‌లు తీవ్రంగా ఉండకపోవచ్చు..
గత నాలుగు దశాబ్దాలుగా, భారత ఫార్మా రంగం బాగా పెరిగి అంతర్జాతీయ హెల్త్‌కేర్‌ సరఫరా వ్యవస్థల్లో కీలకంగా మారింది. మన సంస్థలు ఏపీఐలు, ఇంటర్మీడియట్స్, స్పెషలైజ్డ్‌ ఫార్ములేషన్లను విస్తృత స్థాయిలో తయారు చేస్తాయి. విశేషమైన నైపుణ్యాలు, తక్కువ ధరకే అందించగలిగే సామర్థ్యాలతో పాటు అమెరికా హెల్త్‌కేర్‌ వ్యవస్థతో గణనీయంగా అనుసంధానమయ్యాయి. ఒకరిపై ఒకరు ఆధారపడటం వల్లే ప్రస్తుత టారిఫ్‌ వ్యవస్థలో  ఫార్మాకు మినహాయిపు ఉంటోంది. ఈ నేపథ్యంలో మన ఫార్మా మీద మిగతా పరిశ్రమల్లాగా అమెరికా తీవ్ర స్థాయి టారిఫ్‌లు వేయకపోవచ్చు. – డి. శ్రీనివాస రెడ్డి, చైర్మన్, ఆప్టిమస్‌ ఫార్మా

మన బలాన్ని మనమూ ఉపయోగించుకోవాలి..
మన ఫార్మాపై టారిఫ్‌లు విధిస్తే ఇవి అమెరికా ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తాయి.  2013– 2022 మధ్య పదేళ్లలో మన జనరిక్స్‌ కారణంగా అమెరికా ఎకానమీకి 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయ్యాయి. 200–250 శాతం స్థాయిలో టారిఫ్‌లు వేయకపోవచ్చు కానీ, మిగతా వాటిలా 50 శాతం వేసినా మన ఫార్మాకు ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. ప్రస్తుతానికైతే జనరిక్స్‌కి సంబంధించి భారత్‌కి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం కూడా మన బలాన్ని ఉపయోగించుకుని, గట్టిగా మాట్లాడాలి.  – రావి ఉదయ భాస్కర్, డైరెక్టర్‌ జనరల్, అఖిల భారత ఔషధ నియంత్రణ అధికారుల సమాఖ్య (ఏఐడీసీవోసీ)

సింహ భాగం అమెరికా నుంచే..
2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా మొత్తం ఎగుమతులు 30.47 బిలియన్‌ డాలర్లయితే... అందులో 9.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. అంటే.. మూడో వంతు ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. ఈ సమయంలో అమెరికా మార్కెట్‌ నుంచే అత్యధిక ఆదాయాన్ని పొందిన కొన్ని భారత ఫార్మా కంపెనీలను చూస్తే...

ఫార్మా ఉత్పత్తులపైనా టారిఫ్‌లు బాదేస్తే.. అమెరికా మార్కెట్‌లో కీలకంగా పనిచేస్తున్న ఈ కంపెనీల ఆదాయాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్, బయోకాన్‌ సంస్థలకు 17 శాతం వరకు ఆదాయం తగ్గొచ్చన్నది విశ్లేషకుల మాట. దివీస్‌ ల్యాబొరేటరీస్‌ ఇటీవలే ప్రకటించిన జూన్‌ త్రైమాసికం ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లో తలెత్తిన ధరలపరమైన ఒత్తిళ్ల వల్లే ఇలా జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement