
పేపర్ క్లిప్ కంటే తక్కువ బరువుండే వ్యోమనౌక
వందేళ్లలో బ్లాక్స్ హోల్స్ సమీపంలోకి పయనం
అస్ట్రోఫిజిసిస్ట్ కాసిమో బాంబీ వెల్లడి
సువిశాలమైన అంతరిక్షంలో కృష్ణ బిళాలు(బ్లాక్ హోల్స్) అంతుచిక్కని మిస్టరీయే. వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. బ్లాక్‌హోల్స్ పుట్టుక, పరిణామం గురించి తెలిస్తే విశ్వం ఎలా ఆవిర్భవించిందో, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో చాలావరకు నిర్ధారణకు రావొ చ్చని భావిస్తున్నారు. భూగ్రహం నుంచి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే కృష్ణ బిళాల వద్దకు చేరుకొనే సదుపాయం ఇప్పటికైతే లేదు.
అలాంటి వ్యోమనౌకను ఎవరూ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ, అది సాధ్యమేనని ప్రముఖ అస్ట్రో ఫిజిసిస్ట్ కాసిమో బాంబీ ధీమాగా చెబుతున్నారు. మరో 100 ఏళ్లలో కృష్ణ బిళం వద్దకు వ్యోమనౌకను పంపించగలమని అంటున్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ బ రువు ఎంత ఉంటుందో తెలుసా? కేవలం ఒక పేప ర్ క్లిప్ బరువు కంటే తక్కువే. ఇదొక నానోక్రాఫ్ట్ అని చెప్పొచ్చు. దీంతో కృష్ణబిళాల మిస్టరీలను ఛేదించవచ్చని కాసిమో బాంబీ అంచనా. దీనిపై ‘జర్నల్ ఐసైన్స్’లో వివరాలు ప్రచురితమయ్యాయి.
కాంతి వేగంలో మూడో వంతు వేగం
బ్లాక్‌హోల్ వద్దకు పంపించే నానోక్రాఫ్ట్ శక్తివంతమైన లేజర్‌తో పనిచేస్తుంది. భూమిపైనుంచే దీనిని ఆపరేట్ చేయొచ్చు. కాంతి వేగంలో మూడో వంతు వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. బ్లాక్ హోల్ సమీపంలోకి వెళ్లడానికి వందేళ్లు పడుతుంది. ఇదంతా వినడానికి సైన్స్ ఫిక్షన్‌లాగా అనిపిస్తున్నా.. అది కచి్చతంగా వాస్తవ రూపం దాల్చుతుందని కాసిమో బాంబీ అంటున్నారు. మరో 20 నుంచి 30 ఏళ్లలో ఈ ప్రయోగం పట్టాలకెక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. లేజర్, అంతరిక్ష ప్రయోగాల్లో మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటలోకి వస్తుందని, ప్రయోగాల ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన వెల్లడించారు. కేవలం కొన్ని గ్రాముల బరువుండే నానోక్రాఫ్ట్‌లో మైక్రోచిప్, ఫోటాన్ బీమ్స్‌తో పనిచేసే లైట్ సెయిల్ ఉంటాయి. ఈ బుల్లి వ్యోమనౌక 20 నుంచి 25 కాంతి సంవత్సరాల దూరంలోని కృష్ణబిళాలను పరిశోధిస్తుంది.
భౌతికశాస్త్రంలో విప్లవాత్మకం
బ్లాక్స్ హోల్స్ అనేవి అంత సులువుగా కంటికి కనిపించవు. ఎందుకంటే వాటి నుంచి కాంతి ఉద్గారం జరగదు. సంప్రదాయ టెలిస్కోప్‌లతో గుర్తించలేం. పరిశోధనకు అనువైన బ్లాక్ హోల్‌ను ఎంచుకోవడం ఒక సవాలే. సమీపంలోని నక్షత్రాలపై చూపే గురుత్వాకర్షణ ప్రభావం ఆధారంగా కృష్ణ బిళాలను సైంటిస్టులు గుర్తిస్తుంటారు. భూమి నుంచి 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్‌ను మరో పదేళ్లలోపు కనిపెట్టగలమని చెబుతున్నారు. వీటిపై నానోక్రాఫ్ట్ చేసే పరిశోధనలు భౌతికశాస్త్రంలో విప్లవాత్మకం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సహా ఫిజిక్స్‌లో ప్రాథమిక సూత్రాలను సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. అతి తేలికైన వ్యోమనౌకలను అంతరిక్షంలోకి పంపించగల పరిజ్ఞానమే అందుబాటులోకి వస్తే అది మరిన్ని కీలక పరిశోధనలకు, అంతరిక్షంలోని రహస్యాలను కనిపెట్టడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్