
వేదిక అలస్కా
నాలుగేళ్ల తర్వాత జరుగబోతున్న ముఖాముఖి చర్చలు
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌పై ఒత్తిడి పెంచే అవకాశం
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ భేటీకి వేదిక, తేదీ ఖరారయ్యాయి. ఈ నెల 15వ తేదీన అలస్కాలో ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం స్వయంగా వెల్లడించారు. పుతిన్‌తో తన భేటీ గురించి శనివారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే శుక్రవారం రష్యా అధ్యక్షుడిని కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండడం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్‌ను ట్రంప్ ఒప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల మోత మోగించారు. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అంతేకాకుండా రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్‌పై సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ట్రంప్, పుతిన్ భేటీ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్–రష్యా సమరమే. దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. పుతిన్‌ను కలుసుకోబోతున్నట్లు ఇటీవల హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఒకప్పటి రష్యా భూభాగమే అలస్కా
పుతిన్, ట్రంప్ సమావేశానికి అలస్కా వేదిక అవుతుండడం మరో విశేష పరిణామం. అలస్కా 1867 దాకా రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగమే. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్–2 ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటిష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు ఒక డాలర్ చొప్పున అమ్మేసినట్లు చెబుతుంటారు. 19వ శతాబ్దంలో ప్రపంచంలో ఇది అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ 10 బిలియన్ డాలర్లు(రూ.8.75 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. బంగారం సహా సహజ వనరులకు లోటులేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో ఐదింట ఒక వంతు అలాస్కా ఉంటుంది. అలస్కాతో రష్యాకు విడదీయరాని అనుబంధం ఉంది.
ఆగస్టు 15న సమావేశం ఎందుకు?
ఇక ఇద్దరు కీలక నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ అని మనకు తెలుసు. కానీ, ఎక్కువ మందికి తెలియని సంగతి ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ ఆగస్టు 15. జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా సరిగ్గా రెండేళ్లకు ఇండియాకు స్వాతంత్య్రం లభించింది. జపాన్‌లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ ముందుండి నడిపించారు. విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్‌బాటెన్ ఇండియా గవర్నర్ జనరల్ హోదాలో 1947లో స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్ కలుసుకోబోతున్నారు.