
ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మరణించిన అనాస్ జమాల్ అల్–షరీఫ్
హృదయాలను కదిలిస్తున్న ఆయన చివరి సందేశం
గాజా: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతిచెందారు వారిలో అనాస్ జమాల్ అల్–షరీఫ్ కూడా ఉన్నారు. ఈ దాడిలో మరణించడానికి ముందు అనాస్ రాసిన మెసేజ్‌ను అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందేశం ప్రజల హృదయాలను కదలిస్తోంది. అది చదివితే గుండె బరువెక్కడం ఖాయం. అన్సార్ సందేశం ఏమిటంటే...
వారిని అల్లా క్షమించడు
‘‘ఇది నా వీలునామా. నా చివరి సందేశం. నా మాటలు మీకు చేరాయంటే దాని అర్థం నన్ను చంపడంలో, నా గొంతు మూగబోయేలా చేయడంలో ఇజ్రాయెల్ సైన్యం విజయవంతమైనట్లే. మీకు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నా. అల్లా దయ, ఆశీస్సులు మీకు లభించాలి. నా ప్రజలకు మద్దతుగా, వారి గొంతుకగా ఉండడానికి నా బలం మొత్తం ఉపయోగించానని, చేయగలిగినదంతా చేశానని అల్లాకు తెలుసు. జబాలియా శరణార్థి శిబిరంలోని ఇరుకు సందుల్లో కళ్లు తెరిచినప్పటికీ నా ప్రజల కోసం ఆరాటపడుతున్నా.
నా జీవిత కాలాన్ని అల్లా పొడిగిస్తాడని ఆశపడుతున్నా. దానివల్ల నా స్వస్థలం ఆక్రమిత అస్కెలాన్(అల్–మజ్‌దాల్)కు చేరుకొని, కుటుంబంతో, ప్రియమైనవారితో గడపగలను. కానీ, అల్లా ఆదేశమే ఫైనల్. దానికి తిరుగులేదు. ఇన్నాళ్లూ ఎన్నో బాధలు అనుభవించా. కష్టాలు నష్టాలు నాకు కొత్త కాదు. ఎంతో కోల్పోయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. మా చావులకు కళ్లారా చూస్తున్నవారిని, మా మారణాలను ఆమోదిస్తున్నవారిని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయినవారిని, గత ఏడాదిన్నరగా మా గడ్డపై మా పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసాకాండను, మారణహోమాన్ని ఆడ్డుకోనివారిని అల్లా క్షమిస్తాడని నేను అనుకోవడం లేదు.
నా బిడ్డ నా కంటి వెలుగు
పాలస్తీనా అంటే మాకెంతో ప్రేమ. ముస్లిం ప్రపంచం అనే కిరీటలో విలువైన రత్నం పాలస్తీనా. ప్రపంచంలో ప్రతి స్వేచ్ఛా జీవి గుండె చప్పుడు పాలస్తీనా. మా ప్రజలను మీకు అప్పగిస్తున్నా. కలలు కనడానికి సమయం లేని, స్వేచ్ఛగా, శాంతితో జీవించే అవకాశం లేని మా అమాయక చిన్నారులను అప్పగిస్తున్నా. మా ప్రజల దేహాలు వేలాది టన్నుల బరువు కింద ఛిద్రమైపోయాయి. ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులు వారి శరీరాలను ముక్కలు చేశాయి. ఆ ముక్కలన్నీ వెదజల్లినట్లుగా దూరంగా పడిపోయాయి. నిర్బంధాలు, హెచ్చరికలు మిమ్మల్ని ఆపకూడదు. సరిహద్దులు మీకు అడ్డంకి కాకూడదు.
మీరంతా గొంతు విప్పండి. మా కోసం మాట్లాడండి. మా భూమి విముక్తికి, మా ప్రజలకు మధ్య వారధిగా మారండి. ఆక్రమణకు గురైన మా భూభాగంపై గౌరవం, స్వేచ్ఛ పరిఢవిల్లేదాకా గొంతు విప్పుతూనే ఉండండి. మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని మీకు అప్పగిస్తున్నా. నా ముద్దుల కూతురు షామ్ జాగ్రత్త. ఆమె నా కంటి వెలుగు. ఆమె ఎదుగుదలను కళ్లారా చూసే అదృష్టం నాకు దక్కలేదు. అది కలగానే మిగిలిపోయింది.
నా కుమారుడు సలాహ్‌ను కూడా అప్పగిస్తున్నా. నా భారాన్ని మోసే, ఆశయాన్ని నెరవేర్చే బలవంతుడిగా మారేదాకా అతడికి అండగా ఉండాలనుకున్నా. ఇక నా తల్లి బాధ్యత కూడా మీదే. ఆమె ఆశీస్సులు, ప్రార్థనలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. ఆమె ఇచి్చన వెలుగే నాకు దారిగా మారింది. నా తల్లికి బలాన్ని ఇవ్వాలని అల్లాను ప్రారి్థస్తున్నా. అల్లా ఆమెను కరుణించాలి. నా జీవన సహచారి ఉమ్ సలాహ్ బాధ్యతను సైతం మీ చేతుల్లో పెడుతున్నా. ఈ యుద్ధం నన్ను నా భార్య నుంచి దూరం చేసింది. అయినప్పటికీ మా బంధానికి ఆమె కట్టుబడి ఉంది. ఆమె తన బలం, విశ్వాసంతో నా బాధ్యతలను స్వీకరించి, భుజాన వేసుకొని మోసింది.
అల్లా తర్వాత మీరే రక్షణ
నా కుటుంబానికి అల్లా తర్వాత మీరే రక్షణగా నిలవాలి. ఒకవేళ నేను మరణిస్తే, నా ఆశయాలకు కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకుంటే.. అల్లా ముందుకు వెళ్లి, మీ ఆదేశాలు శిరసావహించానని చెబుతా. శాశ్వతంగా అల్లా సన్నిధికి చేరడం సంతోషకరమే కదా. అమర వీరుల్లో ఒకడిగా నన్ను చేర్చుకో అని అల్లాను వేడుకుంటున్నా. నా పాపాలన్నింటినీ క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా ప్రజలకు, నా కుటుంబానికి కలి్పంచే స్వేచ్ఛా మార్గాన్ని మెరిపించడానికి నా రక్తాన్ని ఒక కాంతిగా మార్చాలని ప్రారి్థస్తున్నా. మీ ప్రార్ధనల్లో గాజాను మర్చిపోవద్దు... నన్నూ మర్చిపోవద్దు.’’
– అనాస్ జమాల్ అల్–షరీఫ్