
ప్రాదేశిక సమగ్రతపై రాజీపడే ప్రసక్తే లేదు
ఆక్రమణదారులకు మా భూమిని అప్పగించం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టీకరణ
కీవ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య ఈ నెల 15న జరుగబోతున్న భేటీ పట్ల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ అసహనం వ్యక్తంచేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వారిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఒప్పందం కుదుర్చుకున్నా అది తమకు సమ్మతం కాబోదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘టెలిగ్రామ్’లో పోస్టు చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న తమ భూభాగాలను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. అవి ఏనాటికైనా ఉక్రెయిన్‌లో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు.
ఒకవేళ వాటిని రష్యాలో అంతర్భాగంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తే సంఘర్షణ మరింత ముదురుతుంది తప్ప తగ్గబోదని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్–పుతిన్ చర్చల్లో ఈ అంశంపై చర్చ జరగదనే భావిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి కోసమే ఆ ఇరువురు నేతల చర్చలు పరిమితమైతే బాగుంటుందని వెల్లడించారు. రెండు దేశాల నడుమ శాశ్వత శాంతి సాధ్యం కావాలంటే తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆక్రమణదారులకు తమ భూమి అప్పగించేందుకు సిద్ధంగా లేమన్నారు.
ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఇతర పక్షాలు తీసుకొనే ఏ నిర్ణయమైనా అది శాంతికి వ్యతిరేకమే అవుతుందన్నారు. పరిష్కారమార్గాలను చంపేసేలా ఎవరూ వ్యవహరించవద్దని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ సిటీపై రష్యా సైన్యం శనివారం డ్రోన్లతో దాడికి దిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. జపొరిజియాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. రష్యా సైన్యం 47 డ్రోన్లు ప్రయోగించగా, వాటిలో 16 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. రెండు క్షిపణులు సైతం ప్రయోగించగా, ఒక క్షిపణిని ధ్వంసం చేశామని తెలియజేసింది.