మూడు దేశాలు ఒక్కటైతే..!  | Russia, India and China to team up to counter Trump tariff war | Sakshi
Sakshi News home page

మూడు దేశాలు ఒక్కటైతే..! 

Aug 8 2025 5:02 AM | Updated on Aug 8 2025 5:02 AM

Russia, India and China to team up to counter Trump tariff war

ట్రంప్‌ టారిఫ్‌ వార్‌ను ఎదుర్కొనేందుకు జట్టు కట్టనున్న రష్యా, భారత్, చైనా ? 

అందుకు అనుగుణంగా మారుతున్న పరిణామాలు 

ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న భారత జాతీయ భద్రతా సలహాదారు 

త్వరలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ రష్యా పర్యటన 

వచ్చే నెలలో చైనాలో మోదీ పర్యటన 

అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్‌ టారిఫ్‌ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. 

చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్‌ దోవల్‌ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్‌ఎస్‌ఏ ధోవల్‌ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్‌ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్‌ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

ట్రంప్‌ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సైతం రష్యాకు వెళ్లి పుతిన్‌ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్‌ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి.  

మారుతున్న భారత్‌ వ్యూహం 
చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్‌ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్‌ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్‌ కంపెనీల రాకను భారత్‌ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్‌ మెడలు వంచాలని ట్రంప్‌ చూస్తున్నారు. ఇందుకు భారత్‌ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్‌ మోపిన టారిఫ్‌ ఇప్పుడు భారత్‌ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. 

ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్‌ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్‌ ఒక్క టారిఫ్‌ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్‌ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్‌ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్‌ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్‌ విట్కాఫ్‌.. వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్‌ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం.  

షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. 
త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ట్రంప్‌ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్‌ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్‌లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్‌ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్‌ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది.  
 
కలిసి నడుస్తానన్న బ్రెజిల్‌ 
తమపై ఏకంగా 50 శాతం టారిఫ్‌ విధించడంపై అమెరికాపై బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్‌కు అస్సలు ఫోన్‌ చేయను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్‌చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్‌లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ అన్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement