ఒక పరీక్ష.. 13 గంటలు | Every November 13-hour college entry examSunung in South Korea | Sakshi
Sakshi News home page

ఒక పరీక్ష.. 13 గంటలు

Nov 16 2025 4:54 AM | Updated on Nov 16 2025 4:54 AM

Every November 13-hour college entry examSunung in South Korea

ప్రతి నవంబర్‌లో..  దక్షిణ కొరియా నేలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంటుంది. ఆ రోజు దేశం ఊపిరి బిగబట్టి నిల్చుంటుంది. కారణం.. ఆ రోజు పిల్లల భవితవ్యాన్ని నిర్ణయించే అత్యంత ప్రతిష్టాత్మక కాలేజీ ప్రవేశ పరీక్ష ’సునుంగ్‌’ జరగడమే. ఆ రోజు ఆకాశంలో విమానాలు ఆలస్యమవుతాయి, వీధుల్లో వాహనాల శబ్దం తగ్గుతుంది. దుకాణాలు సైతం మూతపడతాయి. లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును  నిర్ణయించే ఈ మహాపరీక్ష కోసం  సిద్ధమవుతారు. ఈ పరీక్షలో విజయం యూనివర్సిటీ ప్రవేశాన్ని మాత్రమే కాదు.. విద్యార్థుల ఉద్యోగం, ఆదాయం, నివాసం, చివరికి వివాహ బంధాన్ని సైతం ప్రభావితం చేస్తుంది.

సాధారణంగా విద్యార్థులందరికీ ఇది ఉదయం 8.40 గంటలకు మొదలై సాయంత్రం 5.40 గంటలకు ముగిసే 8 గంటల మెగా మారథాన్‌. పరీక్ష ముగిశాక విద్యార్థులంతా అలసటతో స్కూలు గేటు దాటి బయటికి వస్తారు. అక్కడ తమ కోసం నిరీక్షిస్తున్న తల్లిదండ్రుల ఆనందభాష్పాల ఆలింగనంతో కష్టాన్ని మరిచిపోతారు. కానీ కొందరు విద్యార్థులకు కన్నీరు కార్చేందుకు కూడా సమయం దొరకదు. చీకట్లో ఆశల వెలుగును వెతుక్కుంటారు. పరీక్ష కేంద్రం గదిలోనే మిగిలిపోతారు. రాత్రి 10 గంటల వరకు కూడా వారి పోరాటం కొనసాగుతుంది. వారంతా తీవ్ర దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులు. ఆ క్షణమే వారి అసలు కన్నీటి కథకు అంకురార్పణ!  

సుదీర్ఘ పోరాటమే.. 
సాధారణ విద్యార్థులకంటే 1.7 రెట్లు ఎక్కువ సమయం.. వారికి కేటాయించినా, ఈ సునుంగ్‌ పరీక్ష దాదాపు 13 గంటల సుదీర్ఘ పోరాటమే. అదనపు విదేశీ భాషా విభాగాన్ని తీసుకుంటే.. ఈ పరీక్ష రాత్రి 9.48 గంటల వరకు సాగుతుంది. వారికి మధ్యాహ్న భోజన విరామం మాత్రమే ఉంటుంది. రాత్రి భోజనానికి విరామం లేదు. పరీక్ష నిరాటంకంగా కొనసాగుతుంది. 13 గంటలు.. అంటే ఒక రోజులో దాదాపు సగం సమయం కేవలం పరీక్ష కోసం కేటాయించాలి. 

నొప్పిని భరిస్తూ.. చేతులే కళ్లుగా 
దీనికి కారణం బ్రెయిలీ పరీక్ష పత్రాల బరువు. ప్రతి ఒక్క వాక్యం, చిహ్నం, పటం బ్రెయిలీలోకి మారినప్పుడు, ఒక్కొక్క ప్రశ్నపత్రం సాధారణ ప్రశ్నపత్రం కంటే 6 నుంచి 9 రెట్లు మందంగా మారుతుంది. సియోల్‌ హాన్బిట్‌ స్కూల్‌ ఫర్‌ ది బ్లైండ్‌ విద్యార్థి అయిన 18 ఏళ్ల హాన్‌ డోంగ్హు్యన్‌ ఈ ఏడాది సుదీర్ఘ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులలో ఒకడు. పుట్టుకతోనే పూర్తిగా అంధుడైన డోంగ్హు్యన్‌ కాంతిని కూడా గుర్తించలేడు. ‘సుదీర్ఘ పరీ క్ష కాబట్టి నిజంగా అలసిపోతాను. తప్పించుకునే ప్రత్యేక చిట్కాలేవీ నాకు తెలియవు. నా స్టడీ షెడ్యూల్‌ను అనుసరిస్తా ను. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. అదే ఏకైక మార్గం’.. అన్నాడు డోంగ్హు్యన్‌. 

ఆత్మ విశ్వాసమే ఆలంబన 
సుమారు 16 పేజీలుండే కొరియన్‌ భాషా విభాగానికి సంబంధించిన బ్రెయిలీ పుస్తకం దాదాపు 100 పేజీలు ఉంటుంది. డోంగ్హు్యన్‌ తన వేళ్లతో బ్రెయిలీని చదువుతున్నంత వేగంగానే, జ్ఞాపకశక్తితో వివరాలను నిక్షిప్తం చేసుకుంటూ ముందుకు సాగాలి. ‘మధ్యాహ్నం భోజనం వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో, ఆంగ్లం తర్వాత.. అప్పుడు నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. మాకు రాత్రి భోజన విరామం లేదు. భోజనం చేయాల్సిన సమయంలో పరీక్షతో కుస్తీ పట్టడం మరింత అలసటను కలిగిస్తుంది’.. అన్నాడు 18 ఏళ్ల జియాంగ్‌–వోన్‌. అయినా, ‘చివరికి ఒక గొప్ప విజయం ఉంటుంది అనే భావనే నన్ను ముందుకు నడిపిస్తుంది’.. అని గొప్ప ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. 

ఆలస్యంగా మెటీరియల్‌ 
అంధ విద్యార్థులకు పరీక్ష వ్యవధి, సుదీర్ఘ అధ్యయన గంటలు కష్టం అనిపించదు. వారిముందున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే.. అధ్యయన సామగ్రిని పొందడం! సాధారణ విద్యార్థులు ఆధారపడే ప్రముఖ పాఠ్యపుస్తకాలు, ఆన్‌లైన్‌ ఉపన్యాసాలు వీరికి అందుబాటులో ఉండవు. బ్రెయిలీ వెర్షన్లు చాలా తక్కువ. జాతీయ పరీక్షకు సంబంధించిన ఈబీఎస్‌ (ఎడ్యుకేషనల్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సిస్టమ్‌) తయారీ పుస్తకాలు వీరికి ఆలస్యంగా అందుతాయి. ‘సాధారణ విద్యార్థులు తమ ఈబీఎస్‌ పుస్తకాలను జనవరి–మార్చి మధ్య తీసుకుని ఏడాది పొడవునా చదువుకుంటారు. మాకు బ్రెయిలీ ఫైల్స్‌ పరీక్షకు కొన్ని నెలల ముందు ఆగస్టు లేదా సెపె్టంబర్‌ నెలల్లో మాత్రమే అందుతాయి’.. అని జియాంగ్‌–వోన్‌ వాపోయాడు.   

సెల్యూట్‌ చేయకుండా ఉండలేం 
అంధ విద్యార్థులకు సునుంగ్‌ అనేది కేవలం కాలేజీ ప్రవేశ పరీక్ష మాత్రమే కాదు.. బతుకు ప్రయాణంలో ఎన్నో ఏళ్ల సహనానికి..  పట్టుదలకు నిదర్శనం! ‘బ్రెయిలీ చదవడం అంటే వేలికొనలతో ఉబ్బెత్తు చుక్కలను తాకడం. నిరంతర ఘర్షణ వల్ల వారి చేతులు చాలా నొప్పి పెడతాయి. కానీ వారు దానిని గంటల తరబడి చేస్తారు. అంధ విద్యార్థులు అనుభవించే శారీరక, మానసిక శ్రమకు సెల్యూట్‌ చేయకుండా ఉండలేం’.. అని విద్యార్థుల గురువైన కాంగ్‌ సియోక్‌–జు కొనియాడారు. ‘సునుంగ్‌ కాలేజ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ డే ఇన్‌ సౌత్‌ కొరియా’.. అనే వీడియో, దక్షిణ కొరియాలో సునుంగ్‌ పరీక్ష రోజు దేశం యావత్తు ఎలా నిలిచిపోతుందో.. ఈ పరీక్ష ప్రాధాన్యం, ఒత్తిడిని వివరిస్తుంది. నవంబర్‌ 13న దక్షిణ కొరియా దేశవాప్యంగా 1310 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,54,174 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను డిసెంబర్‌ 5న వెల్లడిస్తారు.

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement