బిల్లు ఆమోదించిన దక్షిణ కొరియా
సియోల్: తప్పుడు, కృత్రిమ సమాచార కట్టడికి దక్షిణ కొరియా కొత్త బిల్లు తెచ్చింది. పదేపదే హెచ్చరించినా వాటి వ్యాప్తికి పాల్పడే సంప్రదాయ, ఆన్‌లైన్ వార్తా మాధ్యమాలకు ఇకపై భారీ జరిమానాలు విధించనుంది. అక్కడి చట్టసభ బుధవారం ఈ మేరకు ఒక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఆరోపణలు రుజువైతే సదరు మీడియా సంస్థలపై దేశ మీడియా నియంత్రణ సంస్థ ఏకంగా 100 కోట్ల వొన్ (7 లక్షల డాలర్ల) దాకా జరిమానా విధించవచ్చు.
తప్పుడు వార్తలకు 50 లక్షల వొన్ల దాకా పరిహారం వసూలు చేయవచ్చు. మీడియా సంస్థలపై ఆరోపణలు కోర్టులో రుజువైతే బాధితులకు జరిగిన నష్టానికి హీనపక్షం ఐదు రెట్ల పరిహారం వసూలు చేయవచ్చు. అయితే ఈ బిల్లు అంతిమంగా మితిమీరిన ప్రభుత్వ సెన్సార్ షిప్ కు దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బిల్లును వీటో చేయాల్సిందిగా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ కు జర్నలిస్టు, పౌర హక్కుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ‘‘బిల్లులో వాడిన పదజాలమే చాలా అభ్యంతరకరం. పైగా మీడియాకు ఎలాంటి రక్షణ చర్యలూ పొందుపరచలేదు. ఇలాగైతే ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల అవినీతి తదితరాలపై విమర్శనాత్మకంగా ఒక్క ముక్క కూడా రాసేందుకు వీలుండదు’’ అంటూ మండిపడ్డాయి.


