పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి..
అంతర్జాతీయ సమాజంలో ఒంటరితనం..
వెరసి ఒత్తిడికి గురైన ఇరాన్-రష్యాలు.. ఇప్పుడు అమెరికా సైతం అడ్డుకోలేని మార్గాన్ని ఎంచుకున్నాయి
అదే 162 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం
ప్రపంచ వాణిజ్యాన్ని శాశ్వతంగా మార్చివేయగల ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది..
ఇరాన్-రష్యాల మధ్య రష్ట్ నుంచి అస్తారా వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఇనుము, కాంక్రీటుతో కూడిన ఉత్త నిర్మాణం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC)లో అత్యంత కీలక భాగం. మొత్తం 7,200 కిలోమీటర్ల పరిధిలోని ఈ కారిడార్ వాణిజ్య ఖర్చులను ఈ రైల్వే లైన్ 30 శాతం తగ్గించడమే కాదు.. రవాణా సమయాన్ని కూడా 37 రోజుల నుండి 19 రోజులకు తగ్గించగలదు. పైగా సుయాజ్ కాలువ మార్గంతో పోలిస్తే సగం సమయం మాత్రమే!.
ఇరాన్‌తో ఈ ఏడాది జనవరిలోనే రష్యా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కీలక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.6 బిలియన్ యూరోల(మన కరెన్సీలో 1,641 కోట్ల రూపాయలు) నిధులను ఒక్క రష్యానే ఈ ప్రాజెక్టు కోసం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టు గనుక అందుబాటులోకి వస్తే.. ప్రతి ఏడాది 20 మిలియన్ టన్నుల సరుకులు(నూనె, గ్యాస్, ఉక్కు, ఆహారం, యంత్రాల వంటివి) రవాణా చేయొచ్చు. అయితే..
రష్యా-ఇరాన్ ఈ రైలు ప్రాజెక్ట్ వ్యూహాత్మకమేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఏర్పడిన ఒంటరితనాన్ని అధిగమించి, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రధారులుగా మారాలని రష్యా, ఇరాన్‌లు భావిస్తున్నాయనేది స్పష్టం అవుతోంది. పైగా సూయాజ్ కాలువ, మలక్కా జలసంధి పాశ్చాత్య దేశాలు అడ్డుపడదగిన మార్గం కాదు కూడా.
ఏయే దేశాలు చేతులు కలపొచ్చు?
చైనా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుతో(BRI) ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం నుండి బాల్టిక్ వరకు నిరంతర వాణిజ్య మార్గాన్ని పర్యవేక్షిస్తోంది. పాశ్చాత్య ఆంక్షలను తిరస్కరిస్తున్న ఈ బ్లాక్.. భవిష్యత్తులో INSTCతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు.
2024లో రష్యా అధికారికంగా గుర్తించిన తాలిబన్ పాలిత అఫ్గనిస్తాన్ కూడా ఈ కారిడార్‌లో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్‌ను పక్కనపెట్టి దక్షిణాసియాలోకి మార్గాన్ని విస్తరించనుంది. ఇదే సమయంలో భారత్ ప్రతిపాదించిన IMEC కారిడార్(అమెరికా, భారత్, ఇజ్రాయెల్, యూరప్ కలిసి ప్రతిపాదించిన మార్గం) ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. దీంతో.. భారత్ కూడా ఈ మార్గాన్ని పరిశీలించవచ్చనే అంచనాలున్నాయి.
ప్రభావం..
ఈ రైలు మార్గం (Rasht–Astara) పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ప్రభావాన్ని తగ్గించడంలో కీలకమే చెప్పొచ్చు. పైగా ఈ కారిడార్ ద్వారా చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో రష్యా-ఇరాన్ సంబంధాలు బలపడతాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచే దిశగా సాగుతుంది. బ్రిక్స్, SCO బలమైన మద్దతుతో.. పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ అడ్డుకోగలరా?
ఇంతటి వ్యూహాత్మకమైన రైలు మార్గాన్ని ట్రంప్ దీన్ని నేరుగా అడ్డుకోవడం చాలా కష్టమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రొత్సహించడమో(IMEC కారిడార్ త్వరగతిన పూర్తయ్యేలా చూడడం) లేదంటే ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లతో ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచానికి దారిదీపం భారతే!


