మహోన్నతమైన రాజ్యాంగం, విశ్వసనీయత మన బలం
మారిటైమ్ లీడర్స్ సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటన
ముంబై: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, వాణిజ్యంలో అంతరాయాలు, సరకు రవాణా గొలుసుల్లో విపరీత మార్పుల వంటి ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ప్రపంచానికి భారత్ ఒక స్థిరమైన దారిదీపంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతి, సమగ్రాభివృద్ధికి భారత్ ఒక ప్రతీకగా మారిందని హర్షం వ్యక్తంచేశారు.
బుధవారం ముంబైలో ఇండియా మారిటైమ్ వీక్–2025 సందర్భంగా మారిటైమ్ లీడర్స్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహోన్నతమైన రాజ్యాంగం, విశ్వసనీయత అనేవి మన దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని స్పష్టంచేశారు. నేటి అంతర్జాతీయ ఒడిదొడుకుల పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒక దారిదీపం కోసం ఎదురు చూస్తున్నాయని, తెలిపారు. గొప్ప బలంతో మన దేశం ఆ దారిదీపం పాత్రను పోషిస్తోందని వివరించారు.
భారత సముద్రయాన రంగం అత్యధిక వేగం, శక్తితో ముందుకు దూసుకెళ్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మన ఓడరేవులు గొప్ప సామర్థ్యం కలిగినవిగా గుర్తింపు పొందాయని వెల్లడించారు. మన సముద్రయానం, వాణిజ్య కార్యక్రమాలు విస్తృతమైన దార్శనికతలో భాగమని చెప్పారు. భవిష్యత్తులో నూతన వాణిజ్య మార్గాలకు ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ ఒక ఉదాహరణ అని స్పష్టంచేశారు.
రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకం
బ్రిటిష్ కాలం నాటి నౌకాయాన చట్టాలను రద్దు చేశామని, 21వ శతాబ్దానికి అవసరమైన నూతన చట్టాలను ప్రవేశపెట్టామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దీంతో స్టేట్ మారిటైమ్ బోర్డులు మరింత బలోపేతం అయ్యాయని, పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో డిజిటల్ టెక్నాలజీకి ప్రాధాన్యం లభిస్తోందని తెలియజేశారు. మారిటైమ్ ఇండియా విజన్‌లో భాగంగా 150 ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దీనివల్ల సముద్రయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమవుతోందని వెల్లడించారు. మనదేశంలోని ప్రధానమైన ఓడరేవుల సామర్థ్యం రెండు రెట్లు పెరిగిందన్నారు.
క్రూయిజ్ టూరిజం గొప్పగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఓడల్లో సరుకు రవాణా 700 శాతానికిపైగా పెరిగిందన్నారు. ప్రధానమైన జల రవాణా మార్గాల సంఖ్య 32కు చేరిందన్నారు. భారతదేశ అభివృద్ధికి మారిటైమ్ రంగం ప్రధాన చోదక శక్తిగా మారిందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో త్రైమాసికం ముగిసిందని, రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకమని సూచించారు. సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ, సుస్థిర తీర ప్రాంత అభివృద్ధిపై మరింతగా దృష్టి కేంద్రీకరించాలని స్పష్టంచేశారు.


