అది పారిస్‌లోని ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే మ్యూజియం.. కళలు, చరిత్రకు ప్రతీకగా నిలిచే లూవ్రె మ్యూజియం. అలాంటి చోట గత నెలలో జరిగిన 88 మిలియన్ యూరోలు (సుమారు రూ. 760 కోట్లు) విలువైన ఆభరణాల చోరీ యా వత్ ఫ్రాన్స్‌ను, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ అత్యంత నాటకీయమైన దోపిడీకి పాల్పడింది..
అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా కాదని, సాధారణ చిల్లర దొంగలని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించడం విస్మయపరిచింది. సినిమాను తలపించే దొంగతనం దోపిడీ జరిగిన తీరు చూస్తే, అది పక్కా ప్రొఫెషనల్స్ పనే అని అంతా భావించారు. ఎందుకంటే, ఆ రోజు ఉదయం 9.30 గంటలకు, మ్యూజియాన్ని సందర్శకుల కోసం తెరిచిన కొద్దిసేపటికే దొంగలు లోపలికి చొరబడ్డారు. 
లిఫ్ట్‌తో ఎంట్రీ 
నలుగురు దొంగలు దొంగిలించిన మెకానికల్ లిఫ్ట్ వాహనం సాయంతో మ్యూజియం బాల్కనీకి చేరుకున్నారు. 
4 నిమిషాల్లో క్లీన్ స్వీప్ 
అక్కడి నుంచి నేరుగా ’గ్యాలరీ డి అపోలో’లోకి దూరి, డిస్క్ కట్టర్ ఉపయోగించి ప్రదర్శన షో కేసులను పగలగొట్టారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో అత్యంత విలువైన 8 నగలను దోచుకున్నారు. 
స్కూటర్లపై పరారీ
ఉదయం 9.38 గంటలకు దొంగలు బయట సిద్ధంగా ఉంచిన రెండు స్కూటర్లపై పరారై, ఆ తర్వాత కార్లలోకి మారి పారిపోయారు. ఈ హడావిడిలో దొంగలు దొంగిలించిన ఒక కిరీటాన్ని మాత్రం కింద పడేసి వెళ్లారు. మిగతా ఏడు నగలు ఇప్పటికీ దొరకలేదు. 
నలుగురు పట్టివేత 
అరెస్ట్ అయిన నలుగురిలో.. ముగ్గురు పురుషులు, ఒక మహిళ పారిస్‌కు ఉత్తరాన ఉన్న పేద ప్రాంతమైన సీన్–సెయింట్–డెనిస్‌లో నివసించే స్థానికులేనని పారిస్ ప్రాసిక్యూటర్ లారె బెకో స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు పురుషులు గతంలో కూడా అనేక దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవించినట్టు పోలీసుల రికార్డుల్లో ఉంది. వీరు వృత్తిపరమైన చిల్లర నేరగాళ్లే తప్ప, అంతర్జాతీయ మాఫియా ముఠాలకు చెందిన వారు కారు. వీరిలో ఒక జంట మాత్రం తమకు ఈ దొంగతనంతో సంబంధం లేదని వాదిస్తోంది. అరెస్టయిన ఇద్దరు పురుషులు మాత్రం.. తమ ప్రమేయాన్ని పాక్షికంగా అంగీకరించారు. ఈ నలుగురు కాక, ఈ దొంగతనాన్ని అమలు చేసిన ఒక వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. 
చారిత్రక నగలు 
చోరీ చేసిన ఆభరణాలలో.. ఎంప్రెస్ యూజీనీ (నెపోలియన్  ఐఐఐ భార్య) ధరించిన బంగారు కిరీటం, మేరీ–లూయిస్ నెక్లెస్, చెవిపోగులు వంటి అత్యంత చారిత్రక విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగిలించిన వస్తువులు ఇప్పటికే విదేశాలకు తరలిపోయి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నప్పటికీ.. వాటిని భద్రంగా తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న ఆశాభావాన్ని ప్రాసిక్యూటర్ వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత, ఫ్రాన్స్ దేశంలోని ఇతర సాంస్కృతిక సంస్థల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాక, లూవ్రె మ్యూజియం నిర్వాహకులు.. తమ విలువైన ఆభరణాలలో కొన్నింటిని మరింత భద్రత కోసం బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌కు తరలించారు. ఏదేమైనా, ಲచోరీల చరిత్రలో, ఈ సైన్–సెయింట్–డెనిస్ గ్యాంగ్ తమ ’మెకానికల్ లిఫ్ట్’, ’స్కూటర్ ఎస్కేప్’ స్టయిల్‌తో ఒక నవ్వుల పేజీని లిఖించింది! 
    
 – సాక్షి, నేషనల్ డెస్క్ 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
