ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లూవ్ర్(లౌవ్ర్) మ్యూజియం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పారిస్ పోలీసులు ధృవీకరించారు. అయితే వీళ్లు పింక్ పాంథర్ ముఠా సభ్యులేనా? అనేది మాత్రం ఇంకా ధృవీకరణ కాలేదు. ప్రస్తుతం వీరిని రహస్య ప్రాంతంలో అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
అక్టోబరు 19న పారిస్‌లోని లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది(louvre museum Heist). మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుండగా.. కన్‌స్ట్రక్షన్ కార్మికుల వేషాలు దుండగులు ఓ భారీ క్రేన్ ద్వారా వెనకభాగం నుంచి లోపలికి చొరబడ్డారు. ఉదయం 10గం. ప్రాంతంలో సరుకు రవాణా ఎలివేటర్(Basket Lift) ద్వారా అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించి బయటపడ్డారు. ఇదంతా కేవలం ఏడు నిమిషాల్లోనే జరిగిపోవడం గమనార్హం.
ఆ ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.895 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దాదాపు 100 మందితో కూడిన అంతర్జాతీయ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే..
ప్రస్తుతం అదుపులోకి తీసుకుంది అనుమానితులా? లేదంటే దొంగలేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. అలాగే నగల రికవరీ ఇంకా జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చోరీకి సంబంధించి మరో ఇద్దరు, ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, వాళ్లే ఈ చోరీకి ప్రధాన సూత్రధారులని తెలుస్తోంది.
New footage shows thieves using chainsaws to execute robbery at The Louvre in Paris.
A manhunt is now underway. pic.twitter.com/0w0Uu6MJyn— Pop Crave (@PopCrave) October 20, 2025
పింక్ పాంథర్ ముఠా గురించి..
లూవ్ర్ మ్యూజియం చోరీ వెనుక పింక్ పాంథర్ ముఠా హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు కారణం.. చోరీ జరిగిన విధానమే!. 2001లో సెర్బియా బెల్గ్రేడ్ కేంద్రంగా డ్రాగన్ మైకిక్ అనే వ్యక్తి ఈ ముఠాను ప్రారంభించారు. ఆభరణా దొంగతనాలకు ఈ ముఠా పెట్టింది పేరు. స్మోక్ బాంబులు, గేట్‌వే కార్లు ఉపయోగిస్తూ సినీ ఫక్కీలో చోరీలు చేయడం ఈ ముఠా స్టైల్. అందుకే 1963లో వచ్చిన ది పింక్ పాంథర్ అనే సినిమా ఆధారంగా ఇంటర్‌పోల్ ఈ గ్యాంగ్‌కు ఆ పేరు పెట్టింది.
ప్రస్తుతం ఈ గ్యాంగ్‌లో సుమారు 800 మంది సభ్యులు ఉన్నారని, యుగోస్లావియా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు. యూరప్, ఆసియా, మిడిల్ ఈస్ట్‌లో ఇప్పటిదాకా 370కి పైగా దొంగతనాలు చేయగా.. చోరీ చేసిన వాటి విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4200 కోట్లు) ఉండొచ్చని అంచనా. దుబాయ్ మాల్‌లో 2007లో పట్టపగలే చేసిన భారీ చోరీ, 2004లో టోక్యోలో కాస్ట్‌లీ డైమండ్ దొంగతనంతో పాటు లండన్, జెనీవా మ్యూజియాల్లో విలువైన చోరీలు చేసింది ఈ పింక్ పాంథర్ గ్యాంగ్. అయితే.. ఈ ముఠా చేసిన చోరీల్లో వస్తువులు రికవరీ కావడం చాలా తక్కువ. ఆభరణాలను ముక్కలు చేసి అమ్మేస్తుండడంతో చాలా కేసులు సాల్వ్‌కాకుండా ఉండిపోయాయి.
ఇదీ చదవండి: చరిత్రలో కాస్ట్‌లీ దొంగతనం ఏదో తెలుసా?


