 
													కాలంతో పాటు ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్‌లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.
వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్‌ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. 
 
శోభిత ధూళిపాళ
వివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.
కుటుంబ వారసత్వం 
అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్‌దాన్  కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్‌ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్‌లో వాడింది.
కీర్తీ సురేశ్
తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్  కాదు గౌరవం’ అని చెబుతుంది.
వారసత్వ రత్నాలు
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. 
ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్‌తో రీ–డిజైన్  చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా! 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
